అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం
ఆదిలాబాద్,జూన్20(జనంసాక్షి): అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు రియల్టర్లు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జిల్లాకేంద్రం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో అనుమతిలేకుండా కొనసాగుతున్న ప్లాట్ల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. దీంతో తమను కాపాడాలని రియల్టర్లు మంత్రిని ఆశ్రియంచే పనిలో పడ్డారని సమాచారం. అయితే ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చేందుకు మంత్రి అయిష్టతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల తన పరువు పోతుందన్న సమాఆరంతో ఆయన దూరంగా ఉంటున్నారు. పట్టణశివారు పరిధిలోకి వచ్చే భూమిలో వెలిసిన అక్రమలే అవుట్లను ఇప్పటి కే తొగించారు. అధికారులు అక్రమ లేఅవుట్లను తొలగించడం ప్రారంభించడంతో భూదందా చేస్తున్న వ్యాపారుల్లో గుబులు మొదలైంది. జిల్లాకేంద్ర శివారుప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాల్లో అక్రమ పాట్ల వ్యాపారం కొనసాగుతోంది. అధికారుల చర్యలతో బెంబేలెత్తిన రియల్టర్లు తొలగింపు చర్యలను నిలిపేయాలని మంత్రి జోగు రామన్నను వేడుకున్నట్లు సమాచారం. అనుమతిలేకుండా అక్రమ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు. వీటి వల్ల ప్రజలు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని చెప్పారు. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను కొనుగోలు చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలని హితవుపలికారు.