అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు
ప్రణాళిక మేరకు నీటి సరఫరా
నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు కాగా.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అడవుల్లో ఉన్న వాగులు, చెరువులు, కుంటలు అడుగంటి పోవడంతో వన్యప్రాణులకు అడవుల్లో నీరు దొరకక అల్లాడిపోతున్నాయి. ఈ తరుణంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడంతో అడవుల్లో ఉన్న వాగులు, చెరువులు అడుగంటిపోయాయి. దీంతో వన్యప్రాణులకు నీరు దొరకక అల్లాడిపోతున్నాయి. వీటి దాహం తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాబోయే జూన్‌లో వర్షాలు కురిసి అడవుల్లో నీరు నిలిచే వరకు వన్యప్రాణులకు నీటి సరఫరా చేయనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 8 రేంజ్‌ పరిధిల్లో 26 సాసర్‌ పిట్లలను నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి పోస్తున్నారు. తలమడుగు మండలం దేవాపూర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన ట్యాంక్‌ నుంచి అడవుల్లో కాలువ ద్వారా మిషన్‌ భగీరథ నీళ్లను తీసుకవెళ్లి వన్యప్రాణులకు నీరు అందిస్తున్నారు. 10 సోలార్‌ బోర్‌వెల్స్‌ వేసి చెరువులు, కుంటల్లో నీటిని నింపుతున్నారు. వాగుల్లో చెలిమెలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వేసవిలో అడవి జంతువుల దాహార్తి తీర్చడానికి అధికారులు నీరందిస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులకు నీటి సమస్యను గుర్తించిన అటవీశాఖ అధికారులు ముందస్తుగా ప్రణాళికలను తయారుచేశారు. జిల్లావ్యాప్తంగా అటవీశాఖ రేంజ్‌ల పరిధిలో జంతువులకు తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. మావల అటవీ ప్రాంతంలో సోలార్‌ బోర్‌వెల్‌ వేసి అక్కడక్కడ గుంతలను ఏర్పాటు చేసిఅందులో నీటిని నింపుతున్నారు. దేవాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి పైప్‌లైన్‌ సహాయంతో జంతువులకు నీరు అందిస్తున్నారు. బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌, బిర్సాయిపేట, ఇచ్చోడ, వివిధ ప్రదేశాల్లో జంతువుల కోసం నీటిని తాగేందుకు
తొ/-టటెలు ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటితొ తొట్టెల్లో నీటిని నింపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 90 చోట్ల జంతువులకు తాగునీటి కోసం సాసర్‌ పిట్లతో పాటు గుంతలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 8 రేంజ్‌ల పరిధిలో 26 సాసర్‌ పిట్ల నిర్మాణం చేపట్టగా.. 10 సోలార్‌ బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేశారు. అడవుల్లో గుంతలను ఏర్పాటు చేసి వన్యప్రాణులకు నీటిని అందిస్తూ వాటి దాహం తీరుస్తున్నారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో సిరిచెల్మ, బిర్సాయిపేట అటవీశాఖ రేంజ్‌లు ఉన్నాయి. ఈ అడవుల్లో వన్యప్రాణులకు ఆహారం లభించడంతో మహారాష్ట్ర నుంచి అడవి జంతువులు వలసలు వస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. చిరుత, ఎలుగుబంట్లు, నీల్‌గాయ్‌, సాంబారు, చుక్కల దుప్పి, కృష్ణ జింక, జింకలు, కొండ గొర్రెలు, రేసు కుక్కలు, నక్కలు, అడవి గొర్రెలు, కుందేళ్లు, అడవి కోళ్లు ఇతర జంతువుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గత ఏడాది నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడయ్యాయి.
————