అటవీ సిబ్బందిపై స్థానికుల దాడి
– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు గాయాలు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ అధికారులు
మహబూబ్‌నగర్, ఆగస్టు18(జనం సాక్షి) : పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల ఆక్రమణలు, నియంత్రించేందుకు వెళ్లిన అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కొత్తగూడ అటవీ ప్రాంతంలో స్థానికులు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. కొత్తగూడలో క్షీణించిన అడవుల పునరుద్దరణ కోసం వేసవి కాలంలోనే అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో తాము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మొక్కలు నాటేందుకు వీలు లేదని సిబ్బందిని అడ్డగించారు. కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలపతిరావు చేతికి గాయాలయ్యాయి. సిబ్బంది ఆయనను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి కిష్టాగౌడ్ జరిగిన సంఘటనను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడ అటవీ ప్రాంతం అటవీశాఖకే చెందుతుందని, ప్రభుత్వ రికార్డులు కూడా స్పష్టంగా ఆ విషయాన్ని వెల్లడిస్తున్నాయని, త్వరలోనే మొక్కలు నాటుతామని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ తెలిపారు.