అడపాదడపా వర్షాలతో చెరువుల్లోకి నీరు
నిజామాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. దీంతో ఆయా మండలలోని గ్రామ చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఈ సీజన్‌లో సాధరణకంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదైంది. జూలై, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయి. వర్షాకాలం ఇంకా నెలరోజు ఉండడంతో అధిక వర్షాలు కురిస్తే సాధారణకంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్ని, మోపాల్, భీంగల్, మోస్రా, ఇందల్వాయి, చందూరు మండలాల్లో 10.0 మి.విూ నుంచి 25.0 మి.విూల వర్షం కురిసింది. నిజామాబాద్ నగరం రెంజల్, వేల్పూర్, భీమ్‌గల్, నిజామాబాద్ రూరల్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా అడపదడపగా భారీ వర్షం కురుస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు ఉపశమనం పొందారు. వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికి నగరంలోని కొన్ని ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.