అడ్డుపడిందనే హత్య చేశా

బెంగళూరు(జ‌నం సాక్షి ): వ్యాపారంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు తన హెర్బల్‌ ఉడ్‌ రిసార్టును విక్రయించేందుకు అవకాశం లేకుండా తన భార్య సహన (37) అడ్డుపడిందనే హత్య చేశానని భర్త గణేశ్‌ (38) జయనగర ఠాణా పోలీసుల విచారణలో నోరు విప్పాడు. ఆమెను తుపాకీతో బెదిరించానని, ఆమె తనను రెచ్చగొట్టి, కాల్చాలంటూ సవాలు విసరటంతో సహనం కోల్పోయి కాల్పులు జరిపానని తన నేరాన్ని అంగీకరించాడు. మొదటి తూటా గోడకు తగిలిన తరువాత కూడా సహన తనపై కేకలు వేస్తుండటంతో మరో రెండు తూటాలు కాల్చానని తెలిపాడు. ‘‘కనకపుర, సకలేశపుర, కెంగేరిల వద్ద రిసార్టులు ఉండగా, వస్తు సేవల పన్ను జారీ అయిన తరువాత నష్టాలు మొదలయ్యాయి. సహన ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా నిర్వహించుకునేది. తీసుకున్న నగదుకు లెక్క ఎప్పుడూ చెప్పేది కాదు. ఆ నగదును ఏం చేస్తుందో కూడా తెలియదు. తమది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు యత్నించాను. నేను ముందుగా చనిపోతే బిడ్డలు అనాథలవుతారన్న ఉద్దేశంతో వారిని బడి వద్దకు వెళ్లి తీసుకొచ్చాను. రిసార్టులో వారిపైకి కాల్పులు జరిపాను. అదే సమయానికి పోలీసులు వచ్చి నన్ను అదుపులోకి తీసుకున్నారని’ విచారణలో గణేశ్‌ వెల్లడించాడు. నిందితుడి విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయన్ను సోమవారం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు.