దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత

దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలి రోజు కావడంతో దేశ వ్యాప్తంగా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత  సైతం తొలి రోజు అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన సామ్‌.. అక్కడ తన విలువైన సమయాన్ని గడిపారు. అక్కడ నిర్వహించిన దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.మరోవైపు సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ  అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరు.. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండ‌స్ట్రీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖల‌పై ఇప్పటికే సమంతకు నాగార్జున‌కు పలువురు మద్దతుగా నిలిచారు.మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున, సమంత కూడా స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని నాగార్జున కోరాడు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండ‌ని సూచించాడు. ఇక సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తన ఆవేదనను అందరితో షేర్ చేసుకున్నారు. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండి. ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. విడాకులు నా వ్యక్తి గత విషయం. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటా. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. మా విడాకుల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఇతర వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.