ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
` అలాగైతే భాజపాకే ప్రచారం చేస్తా
` ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్
దిల్లీ(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు హావిూని అమలు చేస్తే..తాను భాజపా తరఫున ప్రచారం చేస్తానన్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు. దిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భాజపా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని.. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో ఆ పార్టీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.హరియాణా, జమ్మూకశ్మీర్‌లలో భాజపా ప్రభుత్వాల పతనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే.. ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనంటూ మండిపడ్డారు. భాజపా ప్రజావ్యతిరేకమన్న కేజ్రీవాల్.. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు దిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను నిలిపివేసిందన్నారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదని.. అక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోందని ఆరోపించారు.