అణచివేత సమాధానామా?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికలు సమ్మె పట్ల ప్రభుత్వం ఆగ్రహంగానే ఉంది. కఠినంగా అణచి వేయడమే మార్గంగా ఆలోచిస్తున్నది. కార్మికలను ఉద్యోగులుగా పరిగణించేది లేదని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన చెల్లుతుందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. సమ్మెపట్ల కఠిన వైఖరి ఎంత అవసరమో, సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం అదే తీరున ఆలోచన చేసివుంటే బాగుండేది. తెలంగాణలో అణచివేతలు ఉండవన్న సిఎం కెసిఆర్ గత ఐదేళ్లలో అటువైపే అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సంఘం కీలక భూమిక పోషించింది. అలాంటి సంస్థను ప్రైవేటీకరించడం అన్నది మంచిదా అన్నది ఆలోచించాలి. ప్రజలు,కార్మికుల సమస్యలను పరిష్కరించడం మాత్రమే గాకుండా తెలంగాణలో సమస్యలు లేకుండా చేస్తామన్న హావిూలు కూడా నిలబెట్టుకునే బాధ్యత సిఎం కెసిఆర్‌పై ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే ఆర్టీసిని ప్రవైట్ పరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి. ఆర్టీసీని ఓ పద్దతి ప్రకారం సమ్మె వైపు తీసుకుని వెళ్లడంలో తెరవెనకక కుట్ర ఏదైనా జరుగుతందా అన్నది గుర్తించాలి. ఎందుకంటే ఆర్టీసీకి వేలకోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కాజేసేందుకే కొందరు కుట్ర చేస్తున్నారని తాజాగా సిఎం ప్రకటన అంతరార్థంగా తోస్తున్నది. ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేస్తామన్న సిఎం ఇప్పుడు మాటమార్చడం వెనకా ఈ అదృశ్య శక్తుల హస్తం ఉండివుండవచ్చు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇవ్వడం చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేయడం చూస్తుంటే గతంలో ఇచ్చిన హావిూని విస్మరించారనే చెప్పాలి. సమ్మెకు దిగిన కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలూ జరపబోమని సిఎం కెసార్ తేల్చి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించిన సందర్భంగా సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఇవన్నీకూడా ఆర్టీసిని ప్రైవేట్చేస్తామన్న ప్రకట కిందకే వస్తాయి. ప్రధాన ఉద్దేశం కూడా అదే అన్న భావన కలుగుతోంది. సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టం, రూ.ఐదు వేల కోట్ల రుణభారం, క్రమం తప్పకుండా పెరుగుతున్న డీజిల్ ధరలతో పడుతున్న భారం.. ఇన్ని ఇబ్బందులతో ఆర్టీసీ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగి దసరా సమయంలో జనాన్ని ఇబ్బంది పెట్టినవారితో ఎలాంటి రాజీకి రాబోమని ప్రకటించారు. నిజానికి దసరా ముందు సమ్మె అన్నది కార్మికులు ఎంచుకున్న మూర్ఖ నిర్ణయంగానే చెప్పాలి. ఎందుకంటే దసరా అన్నది తెలంగాణలో అతిపెద్ద పండగ. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ద్వారా వారు ప్రజాగ్రహానికిగురయ్యారు. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రూ.50వేల జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థంలేదని సిఎం కెసిఆర్ అంటున్నారు. ఈ యూనియన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదని, ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లో చేరని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు.సమ్మె చేస్తున్నవారు పోను ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం పన్నెండొందలలోపు మాత్రమే ఉన్నారని కేసీఆర్ చేసిన ప్రకటనతో ఇక కఠినంగానే ముందుకు పోతామని ప్రకటించారు. ప్రైవేటీకరణ నిర్ణయంతోనే సిఎం కెసిఆర్ కఠినంగా ఉన్నారన్న విమర్శలు చెలరేగాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేసీఆర్.. ఏకంగా సమ్మెలో ఉన్నవారిని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. తాజా సమ్మెను బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంగా అభివర్ణించిన
ఆయన.. భవిష్యత్తులో ఆర్టీసీకి ఆ సమస్య రాకుండా చూడాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని, ఆ దిశలో ఆర్టీసీని సమూలంగా మార్చనున్నట్టు ప్రకటించారు. అయితే గత ఐదేళ్లుగా ఈ సమస్యపై పెద్దగా దృష్టి సారించలేదు. దనీఇ పర్యవసానాలు చర్చించలేదు. ఇక ఆర్టీసీలో సగం సొంత బస్సులు ఉంటే, మిగతా సగం ప్రైవేటు బస్సులుంటాయని వెల్లడించారు. దీనివల్ల సంస్థ పనితీరు బాగుంటుందని, బస్సులు బాగా నడుస్తాయని, రెండు మూడేళ్లలో నష్టాలు పూడ్చుకుని సంస్థ లాభాల్లోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నిజానికి గత ఐదేళ్లలో ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకు దీనిపై చర్చించలేదన్న అనుమానాలు వస్తున్నాయి. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నం. సంస్థ మనుగడ ఉండటమే కాదు భవిష్యత్‌లో కూడా సంస్థలో ఎప్పటికీ క్రమశిక్షణ రాహిత్యం, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం, తలనొప్పి కలిగించే చర్యలు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు చేస్తున్న ప్రకటన కూడా కఠిన వైఖరిని సూచిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసి పట్ల సిఎం కెసిఆర్ వైఖరి సహేతుకంగా లేదనే చెప్పాలి. అలాగని పండగ ముందు కార్మిక సంఘాల సమ్మెను తీవ్రంగానే పరిగణించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారనే చెప్పాలి.