అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం..
ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం
పేద కుటుంబాలను గుర్తించి ప్రతినెలా రూ.8500 ఇస్తాం
పంజాబ్ రైతు బృందం క్యాంప్‌లో రాహుల్ గాంధీ హామీ
లుధియానా, మే 29 (జనంసాక్షి)
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరొకసారి స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. దీనికోసం ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రైతుకు అవసరమైనంత వరకూ సాయమందిస్తామన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి పంజాబ్ ` హర్యానా సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న క్యాంప్‌ను బుధవారం సందర్శించిన రాహుల్ గాంధీ అన్నదాతలకు తాము భరోసా ఉంటామని హామీనిచ్చారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఒకట్రెండు సార్లు మాత్రమే రైతులకు రుణమాఫీ చేయబోమని, అవసరమైనన్నిసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. దీనికోసం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కిసాన్ కర్జా మాఫీ అయోగ్ పేరిట రైతుల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు అందించేలా చూస్తామన్నారు. మతం, ప్రాంతం, కులం, రాష్ట్రం పేరుతో ప్రజలను విభజించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద కుటుంబాలను గుర్తించి, ప్రతి కుటుంబానికి ప్రతి నెల రూ.8,500 అందజేస్తామన్నారు.
మోడీని జాతి క్షమించదు..
మోడీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారు చేశారని, వారికి సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో మోడీని జాతి ఎప్పటికీ క్షమించబోదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షాధికారుల స్థాయికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత మోడీ ప్రధాని కాబోరని, ఇది తన హామీ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇండియా కూటమి ఉండగా.. మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్న ఎన్డీయే కూటమి ఉందని చెప్పారు. దేనికి అధికారం కట్టబెట్టాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి అన్యాయానికి, అక్రమాలకు, వేధింపులకు గురైన దళితులకు గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. బీజేపీకి ఇది ఎంతమాత్రమూ నచ్చట్లేదని, అందుకే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని రాహుల్ వివరించారు. ప్రజాస్వామ్య, న్యాయ పాలనకు మోడీ ఎప్పుడో ముగింపు పలికారని ఆయన విమర్శించారు.