అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలు కల్పిస్తా : చంద్రబాబు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అవినీతి అక్రమాలకు తావులేకుండా పారిపాలన అందిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర  జిల్లాలో మూడవ రోజుశుక్రవారం నాటికి బాన్సువాడకు చేరింది. పుల్లంపల్లి బుల్లిచౌరస్తా, తాడుకోళ్లు  మీదుగా బాన్సువాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన  అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసారు. అనంతరం జరిగిన సభలో బాబు  మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి కిరికిరి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెందిన పెద్దలు సుమారు 9లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

పోలీసు ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి మూడున్నర లక్షల రూపాయలు వసూలు చేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్‌ను  అధిక ధరకు కొనుగోలు చేసి 6,500 కోట్ల రూపాయల అప్పు చేశారని, ఆ అప్పు తీర్చేందుకు కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం సర్‌ఛార్జీ పేరుతో వినియోగదారులపై పెనుభారం మోపిందని బాబు విమర్శించారు. సోనియాగాంధీ గ్యాస్‌ వినియోగదారుడికి సంవత్సరానికి  తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలని ఆదేశిస్తే ఆమె మాటను ఎవరూ ఖాతారు చేయడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సబ్సిడీపై 10 గ్యాస్‌  సిలిండర్లు సరఫరా చేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ ఆరు నెలలు కుంభకర్ణుడిలా  నిద్రపోయి, ఇప్పుడు నిద్రలేచి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడని ఆరోపించారు. తాము తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోను వ్యతిరేకం కాదని మరోమారు ప్రకటించారు. సింగూరు నీటిని నిజామాబాద్‌కు మళ్లిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై 30మార్లు తప్పుడు కేసులు బనాయించిందని, 25 సార్లు విచారణ జరిపారని, 58 మంది జడ్జీలు మారారని, చివరికి తనపై పెట్టిన   కేసులు కొట్టి వేశారని బాబు అన్నారు. తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించాలని కోరిన  టిఆర్‌ఎస్‌ నాయకుడు కేసీఆర్‌,  వారి కుటుంబ సభ్యులతో బినామీ పేర ఆస్తులను కూడబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని బాబు డిమాండ్‌ చేశారు. రైతులకు, మహిళలకు ప్రత్యేక బడ్జెట్‌ను తాము అధికారంలోకి వస్తే ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హనుమంత్‌ షిండే, మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ. టిడిపి జిల్లా అధ్యక్షుడు గంగాధరగౌడ్‌, ఎమ్మెల్సీ నరసారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భక్త్యానాయక్‌ తదితరులు  పాల్గొన్నారు.