అధికారులు బాధ్యతతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం
– మండల సర్వసభ్య సమావేశంలో ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు జనంసాక్షి, కమాన్ పూర్ : అధికారులు మనసుపెట్టి బాధ్యతతో పనిచేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు పిలుపునిచ్చారు. ఏఎంసి చైర్మన్ గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా గురువారం నిర్వహించిన కమాన్ పూర్ మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమాన్ పూర్ మండలంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు తో పాటు, కమాన్ పూర్ మండల అభివృద్ధికి తన వంతు కృషి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దాసరి రాజలింగం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, వైద్య, విద్య, మిషన్ భగీరథ ,విద్యుత్, ఈజిఎస్, ఐకెపి , పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయని ఇంటింటికి గోదావరి నీళ్లు అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వల్ల నెరవేరడం లేదని పలు గ్రామాల సర్పంచ్ అధికారులను నిలదీశారు. లూప్ లైన్ లో ఉన్నచోట కాకుండా ఇష్టమైన అవసరం లేని చోట మిడిల్ పోల్స్ కాంట్రాక్టర్లు, విద్యుత్ అధికారులు కుమ్మక్కై వేస్తున్నారని వేసే ముందు కనీసం ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మగవాళ్లలో నలుగురికి ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కమాన్పూర్ ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి డిమాండ్ చేశారు. గుండారంలో రైతు వేదిక కు వెళ్లే దారిలో లూజ్ లైన్లు చేతికి అందే ఎత్తులో ఉన్నాయని రైతులు కరెంట్ షాక్ తో చనిపోయే వరకు కరెంటు అధికారులు స్పందించరా అని గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాన రామకృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ చెట్లు నాటే కార్యక్రమంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఏవో ప్రమోద్ కుమార్ పై జూలపల్లి సర్పంచ్ శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనుల పై జిల్లా స్థాయి , డివిజన్ స్థాయి అధికారులతో త్వరలోనే సమావేశాన్ని నిర్వహించి ఇంటింటికి గోదావరి నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టదామని ఏఎంసి చైర్మన్ దాసరి రాజలింగం సింగల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కరరావు ఈ సందర్భంగా సర్పంచులకు, ఎంపిటిసి లకు తెలిపారు. కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో విజయ్ కుమార్ తహసిల్దార్ దత్తు ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం తొలిసారి మండల సర్వ సమావేశానికి ముఖ్య అతిథి హాజరైన కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగును మండలంలోని ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.