అధికార దురాశతో.. 

ప్రజాస్వామ్యాన్ని బలిచేశారు
– దేశాన్ని జైలుగా మార్చేశారు
– ప్రస్తుత కాంగ్రెస్‌ కూడా అదే తీరుగా నడుస్తోంది
– ఎమర్జెన్సీ చీకటి రోజులపై నేటి యువతకు అవగాహన కల్పిస్తాం
– ”ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు” అంశంపై ప్రసంగించిన మోదీ
– కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రధాని
న్యూఢిల్లీ, జూన్‌26(జ‌నం సాక్షి) : అధికార దురాశతో.. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని బలిచేశారని , దేశాన్ని జైలుగా మార్చారని, అసలు 1975లో కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏంజరిగిందో నేటి యువత తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసమే గాంధీ కుటుంబం నాడు  ఎమెర్జెన్సీ విధించిందన్నారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు నిండిన సందర్భంగా ముంబైలోని బిర్లా మాతుశ్రీ ఆడిటోరియంలో ‘ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు’ అన్న అంశంపై ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తూ…అధికారంలో ఉండాలన్న దురాశ కారణంగా ప్రజాస్వామ్యాన్ని బలిచేశారన్నారు. ప్రజల్లో ఎంతో గౌరవమున్న రాజకీయ నేతలను సైతం జైళ్లలో పెట్టారని మోదీ పేర్కొన్నారు. కేవలం ఒక్క గాంధీ కుటుంబం లబ్ది పొందడం కోసమే ఇదంతా చేశారని మోదీ దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థను గొంతునొక్కారని, అభిశంసన తీర్మానాన్ని కూడా తీసుకొచ్చారన్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లకు జైలే గతి అన్న పరిస్థితి కల్పించారని ప్రధాని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఎలా వ్యవహరించారో, ఇప్పుడు కాంగ్రెస్‌ అదే తీరుగా నడుస్తోందని మోదీ అన్నారు. మాజీ జర్నలిస్టు కుల్దీప్‌ నాయర్‌ను గౌరవిస్తాను అని, ఎమర్జెన్సీ సమయంలో స్వేచ్ఛ కోసం ఆయన పోరాడారన్నారు. బీజేపీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినా ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నాని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం పాటలు పాడేందకు కిషోర్‌ కుమార్‌ నిరాకరిస్తే, ఆయన సినిమాలను, పాటలను రేడియోలో నిలిపేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ విధించిన సంవత్సరాల్లో ఏమి జరింగిందో తెలుసుకోవాలని దేశ యువతను కోరుతున్నారని, ఎమర్జెన్సీపై కాంగ్రెస్‌ను విమర్శించేందుకు మేము బ్లాక్‌డేను జరుపుకోవడం లేదని, కానీ ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి…అని ప్రధాని పేర్కొన్నారు. తమ ఉనికి ప్రమాదం పడినట్టు గాంధీ కుటుంబం ఎప్పుడు భయపడినా… దేశంలో భయందోళన నెలకొందనీ, దేశం సంక్షోభంలో పడిందని కేకలు వేస్తుందన్నారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్లు రాజ్యాంగాన్ని కాపాడతారని నమ్మవద్దని మోదీ హెచ్చరించారు. మోదీ హయాంలో దేశం ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ కొనసాగుతోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షపార్టీల పైనా మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘గతంలో ఎవరైతే భయాందోళనలకు గురిచేశారో వారే ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులను చంపుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ వాళ్లే వాదిస్తున్నారు. ఎవరు ఏమి చేశారో చరిత్రకు తెలుసు. భారత రాజ్యాంగం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదని మోదీ స్పష్టం చేశారు.