అధిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులను అవలంబించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి,  అక్టోబర్ 22
 వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆధునిక విజ్ఞానాన్ని జోడించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్త్రీశక్తి భవన్లో జిల్లాలోని ఎరువులు,  పురుగుమందుల  డీలర్లకు వ్యవసాయ విస్తరణ సేవలలో డిప్లమా శిక్షణ పూర్తిచేసిన సందర్భంగా ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశం వ్యవసాయ ప్రధాన దేశమని, దేశాభివృద్ధి, ప్రగతి వ్యవసాయంతో ముడిపడి ఉందని అన్నారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని లక్ష్యంతో సాంకేతికతో పాటు  ఆధునిక విజ్ఞానాన్ని జోడించి రైతులకు ప్రయోగశాలలో రూపొందించబడిన పరిజ్ఞానాన్ని అందజేయవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.  వ్యవసాయ శాఖ,  విశ్వవిద్యాలయాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతు సహకార సంస్థలు రైతులకు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ వ్యవసాయ విస్తరణలో ఇంకా మెరుగైన సేవలు అందించవలసిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. రైతులకు ప్రాథమిక అవసరాలయిన ఎరువులు,  పురుగుల మందులు,  విత్తనాలు వాటి నాణ్యత ప్రమాణాలు, లభ్యత అదేవిధంగా చీడ పీడల సమస్యలకు సంబంధించి   గ్రామస్థాయిలో డీలర్లను సంప్రదిస్తున్నారని, ఇన్పుట్ డీలర్స్  సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందజేయడంలో ప్రాథమిక సలహాదారులుగా పని చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. రైతులకు ఇంకా మెరుగైన సేవలందించేందుకు ఇన్పుట్ డీలర్స్ కు వ్యవసాయ విజ్ఞానాన్ని అందజేసేందుకు డిప్లమా హోల్డర్స్గా  వ్యవసాయ విస్తరణలో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు  డిఏఈఎస్ఐ (డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్)  కార్యక్రమాన్ని తీసుకొని డీలర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శిక్షణ పొందిన డీలర్లు తమ ప్రాంతాల్లో సాగు చేస్తున్న ప్రధాన పంటల సాగుపై ఎప్పటికప్పుడు  రైతులకు అవగాహన కల్పిస్తూ సాగుకు సంబంధించిన పంటలపై మెళుకువలను తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయం దిగుబడిపై అవగాహన కల్పిస్తూ ప్రాథమిక సలహాదారులుగా ఉండాలని ఆమె కోరారు. గ్రామస్థాయిలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు,  సూచనలు చేస్తూ పంటల సాగులో వారు లాభపడేలా శిక్షణ పొందిన డీలర్లు సమర్థవంతంగా మీ సేవలు అమలు పరచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఏడి రమాదేవి, డిఏఈఎస్ఐ ఫెసిలేటర్ రిటైర్డ్ వ్యవసాయ శాఖ ఏడి బసవరాజ్, ఆత్మ సిబ్బంది మంజుల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ విస్తరణ సేవలో  డిప్లమా పొందిన డీలర్లకు కలెక్టర్  సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా సమర్థవంతంగా సంవత్సరం పాటు శిక్షణ నిర్వహించిన అధికారులను, సిబ్బందిని శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.
Attachments area

తాజావార్తలు