అధ్యాపకురాలే కాదు పేద విద్యార్థులను ఆదుకునే అమ్మ
– 150 మంది పేద విద్యార్థులకు యూనిఫామ్ అందించిన ఉపాధ్యాయురాలు
– హర్షిస్తున్న కాంసానిపల్లి గ్రామస్తులు
అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్ ) :- ఆ ఉపాధ్యాయురాలు పాఠాలు చెప్పడమే వృత్తిగా భావించలేదు. విద్యార్థుల కష్టాలు, కనీస అవసరాలు తీర్చేందుకు తమ వంతు సాయంగా వినూత్న ఆలోచనలో ముందుకు సాగుతున్నారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పాటుపడుతున్నారు. తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే కాకుండా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం జి. భాగ్యరేఖ(ఎస్.ఏ) ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయురాలిగా బదిలీపై వచ్చారు. వచ్చినప్పటి నుండి విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారి కుటుంబ స్థితి గతులను తెలుసుకున్నారు. అందరూ పేద కుటుంబానికి చెందిన వారే ఉండటం, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేరనే పరిస్థితిలో ఉన్నారని తెలుసుకున్నారు. అనుకున్నదే తడవుగా విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. పంద్రాగస్టు రోజున పాఠశాలలోని విద్యార్థులందరికీ యూనిఫాంలు కుట్టించి ఇవ్వాలని తన మదిలో అనుకున్నారు. ఆమె భర్త ఎన్. వీరేంధర్ బాబు( ఎస్ వీ వీ స్కూల్, సైదాబాద్)తో విషయాన్ని చెప్పారు. వెంటనే అంగీకరించడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 66 మంది విద్యార్థినీలకు, ప్రాథమిక పాఠశాలలోని 90 మంది విద్యార్థినీ, విద్యార్థులకు హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా యూనిఫాం కుట్టించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం అందించారు.
– సేవలకు సలాం… తమ పిల్లలకు ఉచితంగానే రంగు రంగుల దుస్తులు అందించిన ఉపాధ్యాయురాలు భాగ్యరేఖను విద్యార్థుల తల్లిదండ్రుల అభినందించారు. విద్యాబుద్ధులతో పాటు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూనిఫాం, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర వస్తువులను అందించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలుకు సలాం చేస్తున్నారు. సుదూర ప్రాంతమైన హైద్రాబాద్ నుండి ప్రత్యేక వాహనంలో ప్రతి రోజు సమయపాలన పాటిస్తూ పాఠశాలకు హాజరు కావడంతో పాటు విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
– ఉత్తమ ఫలితాలు… పాఠశాల జీహెచ్ఎం చంద్రశేఖర్ సమక్షంలో ఉపాధ్యాయబృందం విద్యార్థులకు మంచి క్రమ శిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పదో తరగతిలో విద్యార్థులు మండల, తాలూకా, జిల్లా స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. జీహెచ్ఎం చంద్రశేఖర్ పాఠశాల ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం తలపించేలా చెట్లను పెంచారు. స్వయంగా ప్రతిరోజు చెట్లకు నీళ్లు పడుతూ పాదులు తీస్తుంటారు. వేసవి సెలవుల్లోనూ పాఠశాల వద్దకు వచ్చి చెట్లను కాపాడుతారు. ప్రకృతి ప్రేమికుడిగా సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తిస్తుంటాడు. ఉపాధ్యాయుల కృషితో పాఠశాలకు మంచి పేరుంది. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయబృందాన్ని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
