అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఖానాపురం: ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామ శివారులో ఎర్రకుంటలో పడి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై నరేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మునుకుంట్ల సమ్మయ్య గత నాలుగు రోజులుగా కనపడటం లేదని, చెరువు సమీపంలో దుర్వాసన రావటంతో సమీప పొలాలవారు గ్రామస్థులకు తెలిపారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి మృత దేహాన్ని వెలికి తీశారు. కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని సమ్మయ్యగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా సమ్మయ్య మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు.