అన్నదాతల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం

– రైతులు, చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ
– రైతుల పిల్లల విద్యకోసం రైతుబంధు స్కాలర్‌షిప్‌ పథకం
– భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రమాద బీమా వర్తింపజేస్తాం
– భాజపా మేనిఫెస్టోను విడుదల చేసిన యడ్యూరప్ప
– కర్ణాటకలో బీజేపీ గెలుపు ఖాయమని వెల్లడి
బెంగళూరు,మే4(జ‌నం సాక్షి ) : కర్ణాటక ప్రజలు భాజపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, మరో పది రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పటు చేయబోయేది భాజపానేనని కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప పేర్కొన్నారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన దాదాపు వారం తర్వాత భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులకు లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రమాద బీమా వంటి హావిూలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ సందర్భంగా భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మాట్లాడుతూ…’ భాజపా ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఐదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో అన్నదాతలకు అప్పులే మిగిలాయన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. ఈసారి తప్పకుండా భాజపా అధికారంలోకి వస్తుందని వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తుందని యడ్యూరప్ప అన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలివి..
–  రైతులు, చేనేత కార్మికులు.. జాతీయ బ్యాంకులు, సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ.
– ‘స్త్రీ ఉన్నతి నిధి’ పేరిట రూ.10,000 కోట్లతో అతి పెద్ద సహకార సంఘాన్ని ఏర్పాటు.
– రైతుల సంక్షేమానికి భాజపా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. వీరి అభివృద్ధి కోసం రూ.1,50,000 కోట్లు కేటాయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల వ్యవస్థను మెరుగు పరిచి రైతులకు నీటి ఎద్దడి రాకుండా చేస్తాం.
– రైతులు చెమటోడ్చి పండించిన పంటలకు సాధారణ ధరకంటే 1.5రెట్లు ఎక్కువ మద్దతు ధర ప్రకటిస్తాం.
ముఖ్యమంత్రి రైతు సురక్షా యోజనా కింద వ్యవసాయ భూమి లేని కూలీలకు రూ.2లక్షలు ప్రమాద బీమా చెల్లిస్తాం.
– బెంగళూరు పరిధిలోని నదులు, ఇతర సరస్సుల ప్రక్షాళనకు గానూ రూ.2,500 కోట్లు కేటాయియిస్తాం. బెంగళూరుకు కొత్తరూపు తీసుకొస్తాం.
– మహిళలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్లను రూ.1కే అందిస్తాం.
– మహిళల వేధింపులకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేస్తాం.
– మహిళల రక్షణ కోసం ప్రత్యేక విచారణ విభాగాన్ని ఏర్పాటు చేసి 1,000మంది మహిళలకు దీనికింద ఉపాధి కల్పిస్తాం. ఈ విభాగంలో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే పనిచేస్తారు.
– గోవధనిరోధం, గోవుల పరిరక్షణ చట్టం బిల్లు-2012ను మళ్లీ శాసన సభలో ప్రవేశపెడతాం.
– రైతుబంధు స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగా రైతుల పిల్లలు చదువుకునే వీలుంటుంది. ఇందుకు గానూ రూ.100కోట్లు కేటాయిస్తాం.