” అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి – టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ”
శేరిలింగంపల్లి, జూన్ 25( జనంసాక్షి): ఎలాంటి లాభాపేక్ష, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక బాధ్యత కోణంలో ముందుకు సాగుతున్న జర్నలిస్టు పిల్లలకు రంగారెడ్డి జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికిచెందిన ప్రైవేటు పాఠశాలలోనైనా 50 శాతం రాయితీతో విద్యను అందించాలని, ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చొరవచూపాలని టీయూడబ్ల్యూజే హెచ్ – 143 ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్ సాగర్, గాదం రమేష్ లు మాట్లాడుతూ జర్నలిజం రంగంలో పనిచేసే వారంతా సామాజిక సేవ, సమాజ ఉద్ధరణ, లాభాపేక్ష లేకుండా నిరంతరం పని చేస్తుంటారని అన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అవకాశాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరదని, కావున ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీతో విద్యావకాశాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారని, అవకాశం ఉన్న చోట జర్నలిస్టుల పిల్లలకు రాయితీతోకూడిన బోధన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భుజంగారెడ్డి, జిల్లా కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.