అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని!
నెల్లూరు, జూన్ 24 : గత వారం రోజులుగా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులపైనా విస్తృతంగా దాడులు చేస్తూ నెల్లూరు జిల్లాలో 18 బస్సులను సీజ్ చేయగా వాటికి ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను నడిపి రెవెన్యూ పెంచుకోవడంలో విఫలమవుతోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రతిరోజు 18 ప్రైవేటు వాహనాలు హైదరాబాద్‌కు ప్రయాణీకులను చేరవేస్తుండగా ఆర్టీఎ అధికారుల దాడుల ఫలితంగా ఆర్టీసి కేవలం 3 బస్సులను మాత్రమే నడుపుతున్నాయి. దాదాపు ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ 1250మంది హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటారు. ఈ బస్సుల ద్వారా వచ్చే కలెక్షన్ అంతా ప్రస్తుతం స్తంభించిపోగా దీన్ని ఉపయోగించుకోవడంలో ఆర్టీసీ ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసి నెల్లూరు రీజియన్‌కు జిల్లాలోని అన్ని డిపోల నుంచి 16 సర్వీసులను హైదరాబాద్‌కు నడుపుతున్నారు. రోజూ సుమారు 1241 మంది ప్రయాణీకులు ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తుంటారు. నాలుగు లక్షల 80వేలు కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా హైదరాబాద్ ప్రయాణీకుల ద్వారా నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌కు ఆదాయం వస్తుండగా ప్రస్తుతం ప్రైవేటు బస్సులు లేనందున ఆదాయం మరో రెండు లక్షలు పెరగాల్సి ఉంది. ఆర్టీసీ ఆదాయం రోజుకు 8 లక్షలు ఉండాల్సి ఉండగా కేవలం 6 లక్షలు మాత్రమే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులను సీజ్ చేయగా వాటికి ప్రత్యామ్నాయంగా బస్సులను నడపలేకపోవడమే ఇందుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసి రీజనల్ మేనేజర్ కొమరయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేనందున ఎక్కువ బస్సులను హైదరాబాద్‌కు నడపలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం 15 బస్సులు నడుస్తుండగా అదనంగా 3 బస్సులు మాత్రమే మొత్తం 18 బస్సులు మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్‌కు నడుపుతున్నామని, ఈ కారణంగా ఆదాయం కూడా స్వల్పంగానే పెరిగిందని చెబుతున్నారు. అదీగాక జిల్లా మొత్తం మీద 700 బస్సులుండగా ఎక్కువ భాగం బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు కింద నడపాల్సి రావడం వల్ల హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌లు గాని ఇతర డీలక్స్ బస్సులను గాని నడపలేకపోతున్నామని తెలిపారు. బస్సుల కొరత ఎక్కువగా ఉన్నందున కొత్త బస్సులను హైదరాబాద్‌కు నడిపే పరిస్థితి లేదని ఆర్‌ఎం చెబుతున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ద్వారా ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికులంతా 75శాతం మంది రైళ్ల మీద ఆధారపడి కేవలం పదిహేను శాతం మంది ప్రయాణీకులు మాత్రమే ఆర్టీసీలో అదనంగా ప్రయాణిస్తున్నారు. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకోవాలని కొత్తగా ఆర్టీసీ ఎండిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎకె ఖాన్ చెబుతుండగా.. మరోవైపు ఇలాంటి పరిస్థితిని కూడా ఆర్టీసి ఉపయోగించుకోలేకపోవడం పట్ల సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు.