అన్‌సీజన్‌తో తగ్గిన పసిడి ధరలు


ముంబై,మే17(జ‌నం సాక్షి): అన్‌ సీజన్‌ కావడంతో మరోమారు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో కొనుగోల్లు తగ్గడంతో  ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ముంబైలో 420 రూపాయలు, ఢిల్లీలో 430 రూపాయల వరకు దిగజారాయి. వెండి ధర కూడా కిలో 420 రూపాయల మేరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర అత్యంత కీలకమైన 200 రోజుల సగటు కన్నా దిగజారి ఔన్సు 1,288.31 డాలర్లకు దిగజారడం ఆందోళన రేకెత్తించింది. గత ఏడాది డిసెంబరు 28వ తేదీ తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. రోజురోజుకీ డాలర్‌ బలోపేతమై ప్రధాన కరెన్సీలన్నింటితోనూ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరడం కూడా బులియన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ముంబై మార్కెట్‌లో 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 485 రూపాయలు దిగజారి 30,935 రూపాయలకు దిగి రాగా మేలిమి బంగారం ధర కూడా అదే స్థాయిలో తగ్గి 31,085 రూపాయలకు చేరింది. వెండి ధర కిలో 420 రూపాయలు తగ్గి 39,385కి దిగివచ్చింది. ఢిల్లీలో 430 రూపాయల మేరకు తగ్గిన మేలిమి బంగారం ధర 10 గ్రాములు 32,020 రూపాయలకు దిగిరాగా కిలో వెండి ధర 250 రూపాయలు దిగజారి 40,650కు వచ్చింది.
———