అబద్దాల ప్రచారంలో కాంగ్రెస్‌ దిట్ట

దాని పాలనాకాలమంతా అబద్దాలతోనే సరి

అభివృద్ది కోసమే మా శ్రమంతా

మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శ్రీకారం

కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన మోడీ

భోపాల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): అబద్దాలను ప్రచారం చేయడంలో ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఆరితేరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ప్రజల మనస్సుల్లో అయోమయం, నిరాశావాదం సృష్టించి లబ్ది పొందాలని భావిస్తోందని విమర్శించారు. మన దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ ఎన్నడూ ప్రజలను నమ్మలేదన్నారు. వారి శ్రమను పట్టించుకోలేదన్నారు. ఆ పార్టీ అబద్దాలను, అయోమయాన్ని, నిరాశావాదాన్ని వ్యాపింపజేస్తోందని దుయ్యబట్టారు.అయితే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమ భాజపా ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శల ఎక్కుపెట్టారు. భారతీయ జనతా పార్టీ పట్ల, తమ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. ప్రజలకు అబద్దాలను ప్రచారం చేయడం, వారిలో అయోమయం సృష్టించే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళులర్పించారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక, భద్రత రంగాల బలోపేతమే శ్యామ్‌ ప్రసాద్‌ ఆశయమని మోదీ అన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచి వారికి సరైన అవకాశాలను కల్పించాలని సూచించేవారని చెప్పారు. అందులో భాగంగానే స్టార్టప్‌, భారత్‌లో తయారీ వంటి ఆలోచనలు చేసినట్లు వివరించారు.బీజేపీని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని మోదీ అన్నారు. అబద్దాలు, అయోమయం, నిరాశావాదాలను వ్యాపింపజేసినవాళ్ళు క్షేత్రస్థాయి నుంచి దూరమయ్యారన్నారు. పేదలు, రైతులు, సమాజంలో అణగారిన వర్గాల ఉద్ధరణ, సాధికారతల కోసం కేంద్రంలో నాలుగేళ్ళ నుంచి, మధ్యప్రదేశ్‌లో 13 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పరిపాలించినపుడు ఆ రాష్ట్రాన్ని బీమారు రాష్ట్రం అనేవారని గుర్తు చేశారు. దురదృష్టం కొద్దీ ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల ఆలోచనలన్నీ కనుమరుగు కావడంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోదీ విమర్శించారు. అప్పటి నుంచి ఒకే కుటుంబం కీర్తింపబడుతూ ఇతరులను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ ప్రజల కష్టాన్ని అర్ధం చేసుకోలేదన్నారు. గత నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ నిరాశ, ఆందోళనల గురించి తాము మాట్లాడలేదని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. కేంద్రంలో నాలుగేళ్లు, మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లపాటు భాజపా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మధ్య ప్రదేశ్‌ బిమారూ రాష్ట్రంగా పిలిచేవారని గుర్తు చేశారు. బీఐఎంఏఆర్‌యూ(బీమారూ) అంటే బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్టాల్ర మొదటి అక్షరమాలతో పిలిచేవారు. అంటే వెనుకబడిన రాష్ట్రాలు అనే అర్థంలో వాడేవారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఆ ట్యాగ్‌ను తొలగించినట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో సిఎం శివరాజ్‌సింగ్‌ చౌమాన్‌, గవర్నర్‌ ఆనంద్‌ బెన్‌ పటేల్‌ తదిరులు పాల్గొన్నారు.