అబార్షన్లపై గళమెత్తిన ఐర్లాండ్‌

ఎస్‌ క్యాంపెయిన్‌కు భారీగా స్పందన
న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి ): ఐర్లాండ్‌లో 2012లో మృతి చెందిన భారత సంతతికి చెందిన దంత వైద్యురాలు సవితా హలప్పనావర్‌ ఫొటో ప్రస్తుతం ఐర్లాండ్‌ పత్రికల పతాక శీర్షికల్లో దర్శనమిస్తోంది. ఆమె మృతి వెనుక గల కారణం ఎంతో మంది మహిళలను కదిలించడమే కాకుండా ”యెన్‌’ క్యాంపెయిన్‌ పేరిట నిర్వహిస్తున్న ఉద్యమానికి చిరునామాగా మారింది. యెస్‌ క్యాంపెయిన్‌ పేరిట అబార్షన్ల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఆమె ఊపిరులూదింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల  25న నిర్వహిస్తున్న రెఫరెండంలో ఓటు వేసేందుకు బ్రిటన్‌, ఇతర దేశాల్లో స్థిరపడిన మహిళలు కూడా రాబోతున్నారు. శనివారం డబ్లిన్‌లో నిర్వహించిన ర్యాలీకి వేలాదిమంది మహిళలు హాజరయ్యారు. నిజమైన ఆరోగ్య సంరక్షణ అంటే జీవితాలను రక్షించడమని, ముగించడం కాదని కార్యకర్త కొరా షెర్లాక్‌ వ్యాఖ్యానించారు. కాగా, ఈ చట్టంపై ఓటింగ్‌ నిర్వహించగా 47 శాతంమంది అనుకూలమని, 28శాతం వ్యతిరేకమని వెల్లడించారు. మహిళల విషయంలో ఐర్లాండ్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఆమె మృతి నిదర్శనమని అనేకమంది మహిళలు ఆందోళన వ్యకం చేస్తున్నారు. 17 వారాల గర్భవతైన సవిత నడుము నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. గర్భస్రావం కావడంతో వెంటనే అబార్షన్‌ చేసి పిండాన్ని తొలగించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కానీ ఐర్లాండ్‌ చట్టాల ప్రకారం అబార్షన్‌ చేయడం నేరం కావడంతో ఇన్ఫెక్షన్ల కారణంగా ఆమె మృతిచెందింది. ఐర్లాండ్‌ రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణకు సవరణ చేయాలన్నదే యెస్‌ క్యాంపెయిన్‌ ముఖ్య ఉద్దేశం. ఈ అధికరణ ప్రకారం గర్భస్థ శిశువుల జీవించే హక్కు పేరిట ఐర్లాండ్‌ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధం విధించింది. ఈచట్టాన్ని ఎత్తివేయాలని మహిళలు ఉద్యమిస్తున్నారు.