అభిమానులకు ప్రపంచకప్ ఫీవర్
స్పాన్సర్లను బట్టి మారుతున్న కప్ పేరు
ముంబై,సెప్టెంబర్23(జనంసాక్షి): భారత్ వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ జరగనుంది. ట్రోఫీ కోసం మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి ఎలాగైనా ప్రపంచ విజేతగా నిలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. భారత్ సొంతగడ్డ అనుకూలతతో కప్ కొట్టేసే అవకాశం ఉంది. 2011లో ప్రపంచ కప్ ను సొంతగడ్డపైనే గెలుపొందిన సంగతి తెలిసిందే. 2013 చాంపియన్స్ ట్రోఫీ తప్ప మరెప్పుడూ టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నెగ్గలేదు. ఇది పదేళ్లుగా భారత క్రికెట్ అభిమానులను వేధిస్తోన్న
అంశం. ఈ సారి ప్రపంచ కప్ లో పది జట్లు తలపడుతున్నా.. సెవిూస్ వరకు వెళ్లేవి నాలుగైదు జట్లేనని అంచనా. వీటిలో ఒకటి భారత్ కాగా.. మిగతా మూడు డిఫెండిరగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ ఆస్టేల్రియా. అయితే, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లనూ తక్కువ అంచనా వేయలేం. ఈ ఆరింటిలో సెవిూస్ చేరే నాలుగు ఏవనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతతో రూపొందించారు. ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకే విధంగా ఉంటుంది. 11 కిలోల బరువు ఉంటుంది. ట్రోఫీ తయారీకి ఐసీసీ 40వేల పౌండ్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం రూ.30,85,320. విజేతగా నిలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందిస్తారు. విజేత పేరును ట్రోఫీ కింద భాగాన ముద్రిస్తారు. ఒరిజినల్ ట్రోఫీని పోలిన నకలును చాంపియన్ జట్టుకు అందజేస్తారు. అసలు ట్రోఫీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్‌లోని కార్యాలయంలో ఉంచుతారు. 1999 కప్ కోసం తయారు చేసిన ట్రోఫీనే ఇప్పటకీ ఐసీసీ బహుకరిస్తోంది.ప్రపంచ కప్ చరిత్ర గురించి చెప్పుకొంటే 1975లో తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పట్లో ప్రుడెన్షియల్..1975 నుంచి 1983 వరకు మూడు ప్రపంచ కప్ లకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. క్రికెట్ పుట్టిల్లు అయిన ఆ దేశం 2019 వరకు ప్రపంచ కప్ గెలవని సంగతి వేరే విషయం. అయితే, తొలి మూడు కప్ లకు ఆతిథ్యం ఇచ్చిన ఇంగ్లిష్ గడ్డపై కప్ పేరును ప్రుడెన్షియల్ పేరిట వ్యవహరించారు. 1975,79 కప్ లను వెస్టిండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో కప్ ను మాత్రం కపిల్ డెవిల్స్ గెలుచుకుని చరిత్రను తిరగరాశారు. 1975లో టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించినా.. ప్రుడెన్షియల్ కప్ గానే పిలిచారు. స్పాన్సరర్ గా ఉన్నందున ఆ కంపెనీ పేరునే పెట్టారు. ఈ కప్ విజేతకు అందించిన ట్రోఫీ వెండి, బంగారంతో చేశారు. పైన బంగారు పూత పూసిన క్రికెట్ బంతిని ఉంచారు. కాగా, 1979, 1983 ప్రపంచకప్‌లో కూడా ప్రుడెన్షియల్ కంపెనీనే స్పాన్సర్‌గా వ్యవహరించింది. రిలయన్స్ కప్ 1983లో ప్రపంచ కప్ గెలిచిన ఊపులో భారత్ 1987 కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. విశేషం ఏమంటే.. ఇప్పటి దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్టీస్ర్ అప్పటికి ఓ స్థాయిలో ఉంది. ఆ సంస్థనే 1987 ప్రపంచ కప్ టైటిల్ స్పాన్సర్ షిప్ గెలుచుకుంది. దీంతో రిలయన్స్ గా పిలిచారు. వెండి, బంగారంతో కప్ ను రూపొందించారు. క్రికెట్ బాల్ ను ట్రోఫీలో ఉంచారు. ఈ కప్ లో తొలిసారి ఆస్టేల్రియా విజేతగా ఆవిర్భవించింది. ఆస్టేల్రియా లో బెన్సన్ అండ్ హెడ్జెస్..భారత్ లాగే కప్ గెలుచుకున్న అనంతరం.. ఆస్టేల్రియా ప్రపంచ కప్ నిర్వహణకు పూనుకుంది. రిలయన్స్ ఇండస్టీస్ర్ 1987 కప్ నకు మాత్రమే స్పాన్సర్ గా ఉండిపోయింది. 1992 లో ఆస్టేల్రియా లో జరిగిన కప్ నకు బెన్సన్ అండ్ హెడ్జెస్ అనే బ్రిటీష్ సంస్థ స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. ఇదొక టొబాకో కంపెనీ. దీంతో ఈ కప్ ను బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్‌కప్ అని పిలిచారు. కాగా, 1992 ప్రపంచకప్ పాకిస్థాన్ గెలుచుకుంది. తర్వాత వరుస మారింది 1996లో రెండోసారి భారత్ ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి రిలయన్స్ కు స్పాన్సర్ షిప్ దక్కలేదు. ఈసారీ టొబాకో సంస్థ విల్స్ టైటిల్‌ను స్పాన్సర్ చేసింది. దీంతో టోర్నీని విల్స్ వరల్డ్ కప్ గా పిలిచారు. ఈ విల్స్ వరల్డ్‌కప్‌ను శ్రీలంక ఎగరేసుకుపోయింది. కాగా, 1996 తర్వాత ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 1999 కప్ నకు ఐసీసీనే సరికొత్త ట్రోఫీని ప్రవేశపెట్టింది. దీని తయారు బాధ్యతను లండన్‌లోని గారార్డ్ సంస్థకు ఇచ్చింది. తయారీకి 2 నెలలు..ప్రపంచ కప్ ట్రోఫీ తయారీకి పట్టే సమయం రెండు నెలలు. వెండితో తయారు చేసి ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూస్తారు. 60 సెంటీవిూటర్ల ఎత్తుండే ట్రోఫీకి పైన బంగారు రంగులో గ్లోబ్ ఉంటుంది. దీనికి దన్నుగా మూడు సిల్వర్ కాలమ్‌లు ఉంటాయి. ఇవి స్టంప్‌లు, బెయిల్స్ ఆకారంలో నిలువ వరుసగా ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను ప్రతిబింబించేలా ఈ
ట్రోఫీని తయారు చేశారు. గ్లోబ్ క్రికెట్ బంతిని సూచిస్తుంది.