అభివృద్దిని చూసి ఆదరించండి: సోమారపు
రామగుండం,నవంబర్24(జనంసాక్షి): సీఎం కేసీఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఉహించని స్థాయిలో ప్రజా స్పందన లభిస్తుందని రామగుండం టిఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 67 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సీఎంగా నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే చేసి చూపించడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గురుకులాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకయతీ, రైతుబీమా, రైతు బంధు, మండలం నుంచి గ్రామాలకు బీటీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, 24 గంటల నిరంతర విద్యుత్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాదరణ కలిగిన టీఆర్‌ఎస్‌ను చూసి ఓటమికి భయపడి కూటమిగా మన ముందుకు వస్తున్నారన్నారు. వారిని నమ్మితే నిలువునా మోసపోవడం ఖాయమన్నారు. నాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలు నేడు అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డాయన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి విూ కళ్ల ముందు ఉందని.. అభివృద్ధిని చూసి ఓటేయాలని అల్లోల ప్రజలను కోరారు.




