అభివృద్ధి నిధులతో మౌలిక సౌకర్యాలు
గుంటూరు, జూలై 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని సిపివో కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సిఈవో కృష్ణయ్య ఇతర అధికారులతో సమీక్షించారు. తాగునీరు. పారిశుద్ధ్యం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు నిధులు ఇస్తామన్నారు. ఎంపీ వేణుగోపాలరెడ్డికి 6.5 కోట్లు, శ్రీనివాసరావుకు 2.5 కోట్లు నియోజక అభివృద్ధి నిధులు ఉన్నాయని, వీటిని గ్రామాల వారిగా కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కేటాయించిన పనులు ప్రారంభించారో లేదో క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. పనులు ప్రారంభం కాకపోతే రద్దు చేసి కొత్త ప్రతిపాదనలు ఇస్తామని మోదుగుల స్పష్టం చేశారు. సిపివో కృష్ణయ్య మాట్లాడుతూ, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇచ్చిన ప్రతిపాదనలు వెంటనే ఆమోదించామన్నారు. కేటాయింపులు, ఖర్చుకాని నిధులు, పనులు జరుగుతున్న వాటిపై వివరాలను ఎంపీ, ఎమ్మెల్యే వివరాలు అందజేశారు. మాజీ ఎంపిపి వరప్రసాద్, నందిగం సోసైటి మాజీ అధ్యక్షుడు శివప్రసాద్, సర్పంచ్‌లు ఫరీఫ్ పాల్గొన్నారు.