అభివృద్ధి పథంలో స్వయం సహాయక సంఘాలు

మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి
వరంగల్‌, జూలై 30 : మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రం ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం జనగాంలో ఆయన రుద్రమదేవి మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో క్రమశిక్షణ, సమాజసేవ పట్ల ఆసక్తి, సరైన నడవడిక కల్గి సంఘాలుగా ఏర్పడడంతో పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో నడవగల్గుతున్నారని అన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మహిళా చైతన్యంతోనే గ్రామల్లోని పేదలు అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని, రాష్ట్రంలోమహిళా స్వయం, సహయక సంఘాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఇదే స్పూర్తితో మరింత అభివృద్ధి సాధించాలని ఆయన మహిళలను కోరారు. చెక్కులు, కుట్టుమిషన్‌, గ్యాస్‌ పొయ్యిల పంపిణి స్వయం సహాయ సంఘాలలోని సభ్యులకు చెక్కులు, కుట్టు మిషన్లు, గ్యాస్‌ పొయ్యిలను మంత్రులు ఈ సందర్భంగా అందజేసారు. అనంతరం సంఘ సభ్యులు తమ సంఘానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తాము నిర్వహించనున్న వృద్ధాశ్రమంనకు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులను కొరారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు డి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంత్రులను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.