అభివృద్ధి, సంక్షేమ పథకాలే.. టీఆర్‌ఎస్ ను గెలిపిస్తాయి
– విషకూటమికి కుట్రలను తిప్పికొట్టండి
– ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు విస్మరించారు
– ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, అక్టోబర్15(జనంసాక్షి) : త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కూకట్ పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు చేపట్టిన ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ టీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీని మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని స్పష్టమవుతోందని అన్నారు. ప్రజలను మోసంచేసేందుకు మహాకూటమి పేరుతో వస్తున్న కాంగ్రెస్, టీడీపీ,
ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. సిద్ధాంతాలు లేని విష కూటమికి ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలుగువారి కీర్తి నలుదిశలా వ్యాప్తి చేసిన అన్న ఎన్టీఆర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. కానీ చంద్రబాబు కూటమి పేరుతో పార్టీని కాంగ్రెస్ లో కలపటం శోచనీయమని తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే, తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అల్లాపూర్ డివిజన్ ను అభివృద్ధి బాటలో నడిపామని, కోట్ల రూపాయల నిధులతో పనులు చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహాకుటమిని ఇంటికి పంపేందుకు అంతా సిద్దంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజలకు అండగా ఉండే పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ది మాధవరం కృష్ణారావు, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ సభియ గౌసుద్దిన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.