అమరనాథ్‌ యాత్రకు వర్షం అడ్డంకి

– ఎడతెరిపిలేని వర్షంతో.. ప్రారంభమవని యాత్ర
కాశ్మీర్‌, జూన్‌28(జ‌నం సాక్షి) : ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్‌ యాత్రకు తొలిరోజే అంతరాయం ఏర్పడింది. అమర్‌నాథ్‌ యాత్ర కోసం బల్తాల్‌, పహల్గావ్‌ క్యాంపులకు బుధవారమే భక్తులు చేరుకున్నారు. గురువారం ఉదయం 5 గంటలకు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంలో యాత్రకు అంతరాయం ఏర్పడింది. భక్తలెవరూ శిబిరాల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణం అనుకూలంగా మారిన తర్వాతే యాత్ర ప్రారంభిస్తామని వారు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు 2లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి విడతలో 3000 మంది యాత్రికులు జమ్మూ బేస్‌ క్యాంపు నుంచి బుధవారం బయలుదేరి బల్తాల్‌, పహల్గావ్‌లకు చేరుకున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉన్నందున సైన్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం అధునాతన సాంకేతిక పరిఙ్ఞానం సైతం వినియోగిస్తున్నారు. యాత్రికుల వాహనాలకు ఎన్నడూ లేనివిధంగా రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌ను
ఏర్పాటుచేసి వాటి కదలికలను గుర్తించనున్నారు. జమ్మూ కశ్మీర్‌ పోలీసుల, పారా మిలటరీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్‌ ఆర్మీకి చెందిన కనీసం 40 వేల మంది సైన్యాన్ని భద్రత కోసం వినియోగిస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రపై నాలుగు రోజుల కిందట కేంద్ర ¬మ్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్ల గురించి సవిూక్ష నిర్వహించారు.