అమర్ నాథ్ యాత్ర ముగించుకొని బైంసాకు చేరుకున్న యాత్రీకుల బృందం

స్వాగతం పలికిన బంధు, మిత్రులు

• శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వాగత సత్కారాలు

బైంసా, రూరల్ జూలై16 జనం సాక్షి

ఈ నెల 1న అమర్నాథ్ యాత్ర వెళ్లిన భైంసా యాత్రీకుల బృందం ఆదివారం ఇక్కడకు సురక్షితంగా చేరుకుంది. యాత్రీకుల బృందానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పట్టణ ప్రవేశ మార్గంలో ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. అవరోధాలను అధిగమించి అమర్నాథ్ యాత్రను దిగ్విజవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన యాత్రీకుల బృందానికి మహిళలు మంగళహారతులో స్వాగతం పలుకగా బంధుమిత్రులు పూల వర్షం కురిపిస్తూ వారిని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వరకు తీసుకవెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతర యాత్రీకుల బృందానికి స్వాగత సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటం తో వీరు చేపట్టిన అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారింది. రహదారులు మూసి వేయడంతో వీరంతా మార్గమద్యంలో చిక్కుకపోయారు. అయితే సీఆర్పీఎఫ్ జవాన్లు వీరిని సుర క్షితంగా రక్షించి అక్కడి ప్రాంతంలోని బల్తాల్ బేస్ క్యాంపుకు తీసుకవెళ్లి వసతి కల్పించారు. అక్కడ నాలుగు రోజుల పాటు బస చేసిన యాత్రీకుల బృందం పరిస్థితులు మెరుగవ్వగానే ఆమర్నాథ్ చేరుకొని దర్శనం చేసుకున్నారు. 15 రోజుల పాటు కొనసాగిన యాత్ర ఆదివారం బైంసాకు చేరుకోవడంతో ముగిసింది.