అమానవీయ వైద్యం
– తండ్రి భుజాలపై ప్రాణం వదిలిన బాలుడు
– కాన్పూర్‌లో ఘోరం
కాన్పూర్,ఆగస్టు 30(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికి మచ్చగా, డాక్టర్ల వృత్తికి కళంకంగా నిలిందీ ఘటన. డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. నిర్లక్ష్యం కారణంగా, సకాలంలో వైద్యం అందించలేని కారణంగా బాలుగు తండ్రి ఒడిలోనే మరణించాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ బాలుడు తండ్రి భుజాలపైనే మృతి చెందాడు. చికిత్స కోసం తండ్రి ఆస్పత్రుల వెంట తిరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్థానికంగా మెకానిక్ పనిచేసుకునే సునీల్‌కుమార్ కుమారుడు అన్షు(12) ఆరో తరగతి చదువుతున్నాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అన్షును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాల్సిందిగా వారు సూచించారు. బాలుడిని తండ్రి నగరంలో పెద్దదైన పటేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో అత్యవసర వార్డు వద్ద 30 నిమిషాలు వేచి ఉన్న అనంతరం వైద్యులు కనీసం బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూడకుండానే చిన్నపిల్లల విభాగానికి తీసుకెళ్లమని చెప్పారు. ఈ విభాగం అక్కడి నుంచి దాదాపు 200 విూటర్ల దూరంలో ఉంది. ఆస్పత్రి సిబ్బంది కనీసం చక్రాల కుర్చీ కూడా ఇవ్వలేదు. తండ్రి బాలుడిని భుజాన వేసుకొని పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు. చిన్నపిల్లల విభాగంలో వైద్యులు బాలుడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇంకాస్త ముందుగా తీసుకువచ్చి ఉంటే బతికుండేవాడని చెప్పారు. కుమారుడిని భుజాన వేసుకొని ఆస్పత్రుల వెంటతండ్రి తిరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న వారు ఈ ఘటనను మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సమయానికి చికిత్స అందించక నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించడంతో తన కుమారుడు మృతి చెందాడని తండ్రి ఆరోపించాడు. ఈ ఘటనపై స్పందించిన యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ.. బాలుడిని ఆస్పత్రిలో చేర్చుకున్నామని.. అప్పటికే అతను మృతి చెందాడని చెబుతున్నారు.