అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకం పెంపు

29 వస్తువులపై పెంపు
ఆగస్టు 4 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, జూన్‌21(జ‌నం సాక్షి) : అమెరికా ఇటీవల స్టీలు, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతో వాణిజ్య యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. అమెరికా సుంకాల పెంపు కారణంగా భారత్‌పై దాదాపు 241 మిలియన్‌ డాలర్ల భారం పడుతోంది. దీంతో అమెరికా చర్యకు ప్రతిచర్యగా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను పెంచేసింది. మొత్తం 29 వస్తువులపై ఈ సుంకాలను పెంచింది. ఆగస్టు 4 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో శనగలపై 60శాతం, లెంటిల్స్‌(పప్పు ధాన్యాలు)పై 30శాతం, బోరిక్‌ ఆమ్లంపై 7.5శాతం, ఆర్టేమియా రొయ్యలపై 15శాతం దిగుమతి సుంకం ఉంది. వీటితో పాటు స్టీల్‌, ఇనుము ఉత్పత్తులు, యాపిల్స్‌, ట్యూబ్‌, పైప్‌ ఫిట్టింగ్స్‌, నట్స్‌, స్కూల్రు, బోల్ట్‌లు తదితర వాటిపై కూడా సుంకాలను పెంచారు. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మోటార్‌ సైకిళ్లపై మాత్రం ఎలాంటి సుంకాన్ని పెంచలేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని గతవారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 30 ఉత్పత్తుల జాబితాను ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటీఓ)కు పంపించింది. కాగా.. ప్రస్తుతం ఆ జాబితాలో నుంచి మోటార్‌ సైకిళ్లు మినహా మిగతా 29 వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.