అమెరికా, బ్రిటన్‌లను తాకిన.. పౌరసత్వ’ సెగ!

ఈశాన్య రాష్టాల్రకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలి
– ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసిన యూకే, యూఎస్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌14(జ‌నంసాక్షి) : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లోని కొన్నిప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్టాల్రైన అసోం, త్రిపురల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. గువాహటిలో కర్ఫ్యూ విధించారు. అసోంలోని కొన్ని జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే దిల్లీ, బెంగాల్‌లోనూ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఆందోళనల నేపథ్యంలో భారత్‌కు వచ్చే తమ పౌరులకు తాజాగా ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేశాయి అమెరికా, బ్రిటన్‌ దేశాలు. భారత్‌లోని ఈశాన్య రాష్టాల్రకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్త వహించాలని సూచించాయి.  స్థానిక అధికారుల సూచనలు పాటించాలని యూకే తమ ట్రావెల్‌ అడ్వైజరీలో పేర్కొంది. తమ అధికారుల అసోం పర్యటనలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈశాన్య రాష్టాల్రతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా.. మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు జపాన్‌ ప్రధాని షింజో అబే భారత పర్యటన కూడా రద్దయింది.
గువహటిలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు..
అసోంలోని గువహటిలో విధించిన కర్ఫ్యూను శనివారం తాత్కాలికంగా సడలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన కారణంగా అసోంలో నిరసనల వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు అధికారులు అక్కడ నిరసనలు అరికట్టేందుకు కర్ఫ్యూ విధించారు. సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాలను అక్కడ మొహరించారు. గురువారం చేపట్టిన నిరసనల్లో ఇద్దరు పౌరులు మరణించారు. భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ద్వారా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుంది.