అమ్మాయిలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి- డీఈఓ గోవిందరాజులు

విద్యార్థినిలు పట్టుదలతో చదివితే తాము అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు కేజీబీవీ విద్యార్థినిలకు సూచించారు.బుధవారం తెలకపల్లి మండలం రాకొండ కేజీబీవీ ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.విద్యార్థులు చదువులో విజయం సాధించడానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలి అన్నారు.ఇంటర్ పదవ తరగతి విద్యార్థినిలతో ఆయన మాట్లాడుతూ,ఏదైన కారణం చేత ఇప్పటి వరకు బాగా కష్టపడని విద్యార్థులు రానున్న పరీక్షల నాటికి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.విద్యార్థులు పగలు కనే కలలు మాత్రమే సాకారం అవుతాయని,రాత్రి కనే కలలు కలలుగానే మిగిలిపోతాయని అన్నారు.అందుకు ముందుగా మీ భవిష్యత్తు గురించి మంచి పగటి కలలు కనాలని,వాటిని సాకారం చేసుకునేందుకు ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు.పరీక్షలు విద్యార్థులు తాము అనుకున్న మంచి ఫలితాలు రావడానికి ఇప్పటినుండే ప్రణాళికతో కష్టపడి చదివే అలవాటు చేసుకొని వచ్చే ఇంటర్,పదవ తరగతి పరీక్షల నాటికి మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.ప్రణాళికాబద్ధంగా
చదివేందుకు మంచి అలవాటు చేసుకోవాలని సమయాన్ని వృధా చేయకూడదన్నారు.వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఆర్టి లను ఆదేశించారు.విద్యార్థుల విద్య ప్రమాణాలపై సీఆర్పీలదే పూర్తి బాధ్యత అన్నారు.కేజీబీవీ లో విద్యార్థినిల వసతులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎస్ఓను ఆదేశించారు.మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.డిఈఓ వెంట సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్,యస్ఓ హసీనా ఉన్నారు.