అమ్మాయిల స్కార్ఫ్‌పై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్: అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని కనిపిస్తే ఇక జైలుకేనంటూ మధ్యప్రదేశ్‌లోని సాత్నా మేయర్ మమతా పాండే ఆజ్ఞలు జారీచేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తాం. అటువంటి అమ్మాయిలపై మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది. హిందు మహిళలైతే తలపై కొంగు, ముస్లిం మహిళలైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలైతే తలపై ఏదైనా బట్టతో కప్పుకోవడం చేస్తారు. కానీ ప్రస్తుతం మహిళలు సంప్రదాయాలను పక్కనపెట్టేసి దోపిడీ దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారు. ఇటువంటి చర్యలను ప్రొత్సహించరాదని తల్లిదండ్రులను కూడా హెచ్చరిస్తున్నాం.

ఎండనుంచి మహిళలు రక్షణపొందాలనుకుంటే గొడుగులను వెంటతీసుకెళ్లాలి. లేదంటే చిన్న బట్టతో ముఖాన్ని కప్పేలా చూసుకోవాలి. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత ముఖాన్ని కప్పిఉంచరాదంటూ ఆమె ఈ సందర్భంగా ఆజ్ఞలు జారీ చేశారు. మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా దుమారం చెలరేగుతోంది. జబల్‌పూర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. స్కార్ఫ్ ఉపయోగించడంపై ఆదేశాలు జారీ చేసే ఎటువంటి హక్కులు మేయర్‌కు లేవు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కేవలం పోలీసులు మాత్రమే ముసుగు లేదా స్కార్ఫ్ ధరించిన వారిపై ఏదైనా చర్యలు తీసుకునే అధికారం కలిగిఉన్నారని పేర్కొన్నారు.