అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

3

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ అయోధ్య చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న రాహుల్‌.. ప్రముఖ హనుమాన్‌ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు వద్ద గల రామ మందిరాన్ని రాహుల్‌ సందర్శించలేదు. హనుమాన్‌ ఆలయంలో పూజల అనంతరం రాహుల్‌ ఫైజాబాద్‌ బయల్దేరి వెళ్లారు.1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం గాంధీ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ అయోధ్యలో పర్యటించలేదు. 26ఏళ్ల క్రితం రాహుల్‌ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హనుమాన్‌ గర్హి ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆ కుటుంబానికి చెందిన సానియా, రాహుల్‌లు ఎన్నోసార్లు యూపీలో పర్యటించినప్పటికీ అయోధ్య మాత్రం వెళ్లలేదు. కాగా.. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ అయోధ్య వెళ్లడంపై వివిధ పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాల వల్లే రాహుల్‌ పర్యటించారని భాజపా, సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.