అరవింద్‌ తప్పుకోవడంలో మతలబు?

ఆర్తిక ఒడిదుడుకులే కారణామా?

న్యూఢిల్లీ,జూన్‌21(జ‌నం సాక్షి): ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజలు ఇంకా దానినుంచి కోలుకోలేదు. అయితే ఫలితాలు ముందున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పదేపదే ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ దశలో ఈ రెండు అంశాలపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థిక వేత్తగా ఉన్న వ్యక్తే ప్రధానిగా ఉన్నా?ఆర్థిక వ్యవస్థకు మాత్రం అనారోగ్యం అంటూ మోడీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కానీమోడీ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలుచేశారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కీలక సమయంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు చేసిన ప్రకటన దేశవాసులను కలవరానికి గురిచేస్తోంది. అతను తప్పుకోవడంతో పాటు తన కుటుంబంతో కలిసి ఉండేందుకు ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ లో ఈ వివరాలు వెల్లడించారు. అయితే కీలక సమయంలో అరవింద్‌ తప్పుకోవడం ఓ రకంగా ఆర్థికంగా దేశం దెబ్బతినడమే కారణమా అన్న అనుమానాలు వస్తున్నాయి. అదే నిజమని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానికి ఆమోదం తెలపడం మినహా మరో మార్గం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ కీలక పాత్ర వహించారు. 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని, ఇవన్నీ అరవింద్‌ సుబ్రమణియన్‌లో పుష్కలంగా ఉన్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ దశలో ఆయన తప్పుకోవడం, త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం జరగడం సహజంగానే అనుమానాలు పెరిగాయి.