అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డు సభ్యుడిగా శ్రవణ్ కుమార్ ఆచార్యులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యులను బోర్డు మెంబర్ గా నియమించినట్లు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి  జగదీష్ రెడ్డిని ఆ సంఘ నాయకులు  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు చెల్లించడమే కాకుండా వారికి, వారి కుటుంబ సభ్యులకు  అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా అండగా ఉంటుందన్నారు.గ్రామీణ దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కొరకు అర్చకులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక భరోసాను కల్పిస్తుందని తెలిపారు.అనంతరం అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలకు , గంగు ఉపేంద్ర శర్మకి అర్చక సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో ఉమామహేశ్వరరావు తదితరులున్నారు.