అర్థరాత్రి వరకు కేసుల వాదన

సెలవుల నేపథ్యంలో ఆదర్శ నిర్ణయం
ముంబయి,మే5(జ‌నం సాక్షి):  అత్యవసరంగా పరిష్కరించాల్సిన కేసులు పెండింగ్‌ పడకుండా ఉండేందుకు బాంబే హైకోర్టులోని ఓ న్యాయమూర్తి తెల్లవారుజామున 3.30 వరకు పిటిషన్లపై వాదనలు విని తీర్పులిచ్చారు. వేసవి సెలవులకు ముందు రోజైన శుక్రవారం బాంబే హైకోర్టులోని న్యాయమూర్తులు తక్షణం పరిష్కరించాల్సిన పిటిషన్లపై విచారణ జరిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో చివరి పనిదినం అయినందున పలు అత్యవసర విచారణ పిటిషన్లతో కోర్టు కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5 గంటలకు కోర్టు ముగుస్తుంది. సాధారణంగా ఆలోపు వీలైనన్ని పిటిషన్లను పరిష్కరిస్తారు. కానీ ఆ న్యాయమూర్తి మాత్రం ఉదయం 3.30 వరకు కేసులు వింటూనే ఉన్నారు. జస్టిస్‌ షారుఖ్‌ జే కథవల్లా అత్యవసర పిటిషన్లు పెండింగ్‌ పడకూడదని తెల్లవారుజామున 3.30 గంటల వరకు వివిధ పిటిషన్లపై వాదనలు వింటూ, తీర్పులు చెప్తూ ఉండిపోయారు. ఆయన కోర్టు గది ఉదయం నుంచి పిటిషనర్లు, న్యాయవాదులతో నిండిపోయింది. దాదాపు వంద పిటిషన్లు తక్షణ విచారణ చేపట్టాల్సినవి ఉన్నాయని ఓ సీనియర్‌ న్యాయవాది తెలిపారు. న్యాయమూర్తితో పాటు సీనియర్‌ న్యాయవాదులు కౌన్సిల్‌ కూడా తెల్లవారుజాము వరకు కోర్టులో ఉన్నారు. కథావాలా కొద్దిరోజుల క్రితం కూడా ఓ కేసు విచారణలో తన ఛాంబరలో అర్ధరాత్రి వరకు వాదనలు వింటూ ఉండిపోయారు. ఉదయం 3.30 గంటల సమయంలో కూడా న్యాయమూర్తి చాలా ఓపికగా ఉన్నారని, ఉదయం ఎంత చురుగ్గా ఉన్నారో రాత్రి కూడా అలాగే ఉన్నారని ఓ న్యాయవాది తెలిపారు. చివరగా
విచారణ జరిగింది తన కేసే అని, ఆ సమయంలో కూడా ఆయన చాలా సహనంగా వాదనలు విని తీర్పు చెప్పారని మరో న్యాయవాది అన్నారు. శుక్రవారం జస్టిస్‌ కథవల్లా కోర్టు ప్రారంభానికి గంట ముందే విచారణ ప్రారంభించారని, సాయంత్రం అయిదు తర్వాత కూడా ఉన్నారని తెలిపారు. రాత్రి చాలా ఆలస్యమైనప్పటికీ మిగతా పెండింగ్‌ పని పూర్తిచేయడానికి తిరిగి ఈ రోజు ఉదయం కోర్టు ఛాంబర్‌కు వచ్చారని కోర్టు రూం సిబ్బంది ఒకరు తెలిపారు.