అర్బన్‌లో బీగాల జోరు ప్రచారం

ప్రజల స్పందన బాగుందన్న గణెళిశ్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నగరంలోని అర్బన్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణెళిష్‌ గుప్త ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోని 1 డివిజన్‌ చంద్ర శేఖర్‌ కాలనీలో ప్రచారం చేశారు. అక్కడి ప్రజలను పలకరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ కు ఓటు వేసి మరింత అభివృద్ధికి సహకారం ఇవ్వాలని గణెళిష్‌ గుప్తా ప్రజలను కోరారు. నిజామాబాద్‌ నగరంలో తన ఎన్నికల ప్రచారానికి బ్రహ్మండమైన స్పందన లభిస్తున్నదని గుప్తా అన్నారు. అర్బన్‌ ఆఫీస్‌ నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రజల ఆదరణ చూస్తుంటే కచ్చితంగా మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కడతారనే నమ్మకం ఉందన్నారు. గత పాలకులు నిజామాబాద్‌ నగరాభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో రూ. 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకొని సీఎంగా మరోమారు కేసీఆర్‌ను చూడాలని ప్రజలు ధృడ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ హయాంలో జరుగుతున్నదని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్‌ ఆసరా పింఛన్‌ను రూ. 2016 పెంచుతామని, పింఛన్‌ పొందేందుకు వయసు నిబంధనను 57ఏళ్లకు పరిమితం చేస్తామని తెలిపారు. నగర సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, బ్రిడ్జి పనులను, అమృత్‌ పథకం కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, డివిజన్‌ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.