అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
గోదావరి ఉధృతితో లంకగ్రామాలు విలవిల

అమరావతి,జూలై14(జనం సాక్షి): దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకతమైన తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు వంగి ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయల సీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 12వ తేదీ మధ్య 45 మిల్లీవిూటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 75 శాతం అధికంగా 78.7 మిల్లీవిూటర్ల వర్షంపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న వరదతో గోదావరి లంక గ్రామాలను ముంచెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద 15.20 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.37లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వరద 58.5 అడుగులకు చేరుకుంది.