అవకాశం కోసం అసమ్మతి ఎదురుచూపు
గులాబీ దండులో చాపకింద నీరులా వ్యవహారం
కరీంనగర్‌అక్టోబర్ 9 (జనంసాక్షి): కరీంగనర్ గులాబీ తోటలోనూ అసమ్మతి రాజుకుంటోంది. ఎప్పటికప్పుడు దానిని సద్దుమణఙగేలా చేస్తున్నా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భావనలో ఉన్నారు. ఇకపోతే సిఎం కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గం మినహా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 స్థానాలలో సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. చొప్పదండి తప్ప అంతా పాతవారికే ఇచ్చారు. చొప్పదండిలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోగా.. తాజామాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. టికెట్ రేసులో ముందున్న సుంకె రవిశంకర్ ఎవరికివారుగా టీఆర్‌ఎస్ నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి బాగానే ఉన్నా.. వేములవాడ, రామగుండం, మానకొండూరులో టికెట్ల కేటాయింపుపై నిరసనలు, ఆందోళనలు జరిగాయి. పెద్దపల్లి, మంథని, జగిత్యాలలోనూ అసంతృప్తులు నిరసన గళమెత్తారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో మానకొండూరులో వివాదానికి శనివారం తెరపడింది. రామగుండం, వేములవాడలో పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతోంది. పెద్దపల్లి, మంథనిలో చాపకిందనీరులా అసమ్మతి రగులుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారంతో ఇప్పటికే రెండు విడతలుగా చుట్టేసిన మంత్రి ఈటల రాజేందర్.. హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్లలో ప్రచారం ¬రెత్తుతోంది. మంథ ని, పెద్లపల్లి, రామగుండంలో అభ్యర్థులు ప్రచా ర ం చేస్తున్నారు. రామగుండం, వేములవాడ, జగిత్యాలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసంతృప్తులు కూడా ప్రచారం చేస్తుండటం తలనొప్పిలా మారింది. మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు నెలరోజులుగా గ్రామగ్రామానా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ నాలుగేళ్ల మూడునెలల కాలంలో నియోజకవర్గానికి ఏం చేశామనే విషయాన్ని వివరిస్తూ ముందుకెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసేలా కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసంతృప్తులున్న చోట బుజ్జగింపుల పర్వం కూడా సాగుతోంది.