అవతరణ దినోత్సవాలకు తెలంగాణ సెగ
వేడుకలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు
బోసిపోయిన కలెక్టరేట్లు
నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు
హైదరాబాద్, నవంబర్ 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు తెలంగాణ సెగ తగిలింది. పోలీసుల పహారా మధ్య వేడుకలకు నిర్వహించుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ జిల్లాల్లో నిర్వహించిన వేడుకలకు జనం రాలేదు. కేవలం అధికారులు, పోలీసులు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఖాళీ కుర్చీలను ఉద్దేశించి కలెక్టర్లు ప్రసంగించడం గమనార్హం. విద్రోహ దినంగా పాటించాలన్న టీ-జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వం పోలీసుల భద్రత నడుమ అవతరణ దినోత్వసాలను నిర్వహించింది. పది జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో పలుచోట్ల తెలంగాణ వాదులు నల్లజెండాలు ఎగురవేశారు. కలెక్టరేట్‌లో జరిగిన అవతరవ దినోత్సవాలను అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి చేశారు. డీసీసీ భవన్‌లో నిర్వహిస్తున్న వేడుకలను తెలంగాణ వాదులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే వినయ్‌సాగర్ సహా పలువురి అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. అటు జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. జిల్లా కోర్టుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. నల్లబెలూన్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అధికారులు, పోలీసులు మాత్రమే హాజరయ్యారు. జనం అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో పాఠశాలల విద్యార్థులను తీసుకువచ్చి కూర్చోబెట్టారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్.. చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. నల్లగొండ జిల్లాలోనూ తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్రోహ దినంగా పాటించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వైపు దూసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ తెలంగాణ వాదులు నవంబర్ 1ని విద్రోహం దినంగా పాటించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు బహిష్కకరించారు. అవతరణ దినోత్సవాల్లో జర్నలిస్టులు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దమనం చేసి, తెలంగాణ నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లాలోనూ నిరసనలు మిన్నంటాయి. కలెక్టరేట్‌లో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాఠీచార్జి చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగురవేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. నారదాసుతో పాటు వంద మందికి పైగా జేఏసీ నేతలను అరెస్టు చేశారు. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా జేఏసీ, టీఆర్‌ఎస్ నేతలు నల్లజెండాలు ఎగురవేశారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తెలంగాణ వాదులు రాష్ట్ర అవతరణ దినాన్ని విద్రోహ దినంగా పాటించారు. నల్లజెండాలు ఎగురవేసి, నిరసన తెలిపారు.
టీఆర్‌ఎస్ భవన్‌లో నల్లజెండాలు..
రాష్టావ్రతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటిస్తూ టీఆర్‌ఎస్ నల్లజెండాలు ఎగురవేసింది. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి నల్లజెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాస్తే ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నారు.