అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

విమర్శలతో ఎదురుదాడితో తప్పించుకునే యత్నం
టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది
తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతోంది
కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ):టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత ప్రభుత్వం ఆందోళనలో ఉందన్నారు.కేంద్ర పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. నగరంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగుతోంది. పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంపాపేటలోని శుభం ప్యాలెస్‌లో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌ లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందన్నారు. ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సింధియా తెలిపారు. కేంద్ర నిధులపై కేటీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలే అని చెప్పారు.తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా సాయం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో రోజు రోజుకు ప్రజల్లో బీజేపీ, మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికలను చూస్తే గతంలో కార్పొరేటర్ల ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే బీజేపీవి ఉండేవి. కానీ గత ఎన్నికల్లో 38 బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ, మోదీపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. శాసనసభకు సంబంధించి గత ఎన్నికలు తెలుగుదేశంతో కలిసి పోరాడితే బీజేపీతో గెలిచిన సీట్ల కంటే ఇప్పుడు సొంతంగా బీజేపీ పోటీ చేసి గెలుస్తోందన్నారు. ఇప్పుడు ముగ్గురు నేతలు గెలిచారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచిన ఆయన… ముర్మును అవమానించడమంటే గిరిజనులు, మహిళలను కించపరచడమేనని స్పష్టం చేశారు. ఇకపోతే జిల్లా కోర్‌ కమిటీ సమావేశంలో.. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో బీజేపీ పార్టీ పరిస్థితి గురించి జ్యోతిరాదిత్య సింధియా అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ కు సింధియా బీజేపీ ఇన్‌ ఛార్జ్‌ గా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీలో రెండ్రోజుల పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బీజేపీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్‌ చేశారు. మలక్‌ పేట్‌, చంద్రాయణగుట్ట, గోషామహాల్‌, చార్మినార్‌, కార్వాన్‌ అసెంబ్లీ పరిధిలో జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగనుంది. రెండు రోజుల పాటు ఫలకనూమా ప్యాలెస్‌ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బస చేయనున్నారు.

తాజావార్తలు