అవినీతి తిమింగల పట్టివేత
` ఏసీబీకి చిక్కిన మహబూబ్‌నగర్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్
` 12 కోట్ల పైచీలుకు అక్రమ ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్(జనంసాక్షి): రవాణాశాఖ మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం 5గంటల నుంచి సోదాలు నిర్వహించిన అధికారులు రూ.12కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించిన ధ్రువపత్రాలు, డాక్యుమెంట్స్, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తులను గుర్తించామన్నారు.హైదరాబాద్‌లో ఆరు చోట్ల, నిజామాబాద్‌లో మూడు చోట్ల, నారాయణఖేడ్‌లో 3 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లో 30 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాల భూమికి సంబంధించి అక్రమ ఆస్తులను గుర్తించినట్లు వెల్లడిరచారు. పాట్ మార్కెట్ లోని అజిత్ గోల్డ్ దుకాణంలో కిషన్ నాయక్ పేరిట ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక కిలో బంగారంతో పాటు, నిజామాబాద్‌లో లహరి అంతర్జాతీయ హోటల్, అపార్ట్‌మెంట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం రూ.12 కోట్ల పైగా అక్రమ ఆస్తులు గుర్తించామని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రెండిరతలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని అతని బంధువు విజయ్ ఇంట్లో పలు డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కిషన్ నాయక్ కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు తెలుసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.



