అవినీతి, నాణ్యమైన రాజకీయాలకు పోటీ

– మాయమాటలతో ప్రజలను బోల్తాకొట్టిస్తామంటే కుదరదు
– ఐదేళ్లలో కర్ణాటకను అభివృద్ధి పథంలో నిలిపాం
– భాజపాపై ట్విట్టర్‌లో ధ్వజమెత్తిన రాహుల్‌
న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ… భాజపాపై ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌పై భాజపా వ్యక్తిగత విమర్శలకు దిగుతోందంటూ ఆరోపించారు. ‘భాజపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదేదో మాట్లాడుతున్నారని, మాయ మాటలతో ప్రజలను బోల్తా కొట్టిస్తామంటే కుదరదు.. ఎందుకంటే ఇది అవినీతి రాజకీయాలకు, నాణ్యమైన రాజకీయాలకు మధ్య జరిగే పోటీ అని రాహుల్‌ అభివర్ణించారు. ఇది మాఫియా, ప్రజల మధ్య జరిగే యుద్ధమని, ఇందులోకి భాజపా అవినీతితో కూడిన యడ్డీ గ్యాంగ్‌ను యుద్ధంలోకి దింపాలనుకుంటోందని, ప్రజలవైపు మేమున్నామని, మా ప్రజలకు ఎవర్ని గెలిపించాలో తెలుసు అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో… కర్ణాటకలో కాంగ్రెస్‌కు తిరుగేలేదని, ఐదేళ్లలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి వివరాలు చూశాక ఇక భాజపా పోటీ చేయనవసరం లేదని రాహుల్‌ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌-భాజపా పోటీ కూడా లేదని, కావాలంటే విూరు ఈ డేటా చూడండంటూ సిద్ధిరామయ్య ఐదేళ్ల పాలనలో ప్రగతిని వివరించారు. ఐదేళ్లలో 53లక్షల ఉద్యోగాలు కల్పించామని, రైతులకు రూ. 12,000కోట్లు రుణాలు మంజూరు చేశామని, దాదాపు 15.3లక్షల మందికి నివాసం కల్పించామని, భాజపా ప్రభుత్వంలో కనీసం లక్షన్నర కోట్ల రూపాయలు కూడా లేని రాష్ట్ర వార్షిక బ్జడెట్‌ను రూ.2.09,181కోట్లకు పెంచామని రాహుల్‌ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో విూ ప్రభుత్వంలో కర్ణాటక 11వ స్థానంలో ఉందని, కానీ ప్రస్తుతం 1వ స్థానంలో కొనసాగుతోందన్నారు. ఐదేళ్లకాలంలో శిశు మరణాల రేటును 1.37శాతం నుంచి 0.44శాతంకు తగ్గించామని, ఇలా అన్నింట్లోనూ అభివృద్ధి సాధించామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మరో మూడు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. మే 12న జరగనున్న ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.
————————————-