అవినీతి మంత్రులను బర్త్‌రఫ్ చేయాలి
గవర్నర్‌కు దాడి వినతి
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ నరసింహంను కలిసి అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయాలని కోరారు. మంగళవారం ఆ పార్టీ సినీయర్ దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నరసింహులు తదితరులు గవర్నర్‌లు రాజభవన్‌లో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సంపదనంతా దోచుకుంటున్నారని ఆరోపించారు. సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వం ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతోందని ఆరోపించారు. బాక్సైట్ అనుమతులను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నదని ఏ మంత్రి ఎప్పుడు జైలుకు వెళతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
సిబిఐ చార్జీ షీట్‌కు నైతిక బాధ్యత వహించి మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులను చూసి మంత్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. అవినీతి మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేస్తే తన కుర్చీకి ఎసరు ఎక్కడ వస్తుందన్న భావంతో ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. ఆరోపణలు వచ్చిన, శిక్ష పడిన మంత్రులు, మంత్రి పదవుల్లో కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని రాజకీయపార్టీలంటేనే అసహ్యపడే పరిస్థితి దాపురించిందని దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న మంత్రులను పోలీసులు దొంగలుగా భావిస్తున్నారని అందుకే వారిని చూసి భయపడుతున్నారని, అదే విధంగా మంత్రులను చూసి ముఖ్యమంత్రి భయపడుతున్నారని వీరభద్రరావు ఎద్దేవా చేశారు.
మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ కిరణ్ క్యాబినెట్‌లో ఉన్న వారంతా దొంగలేనని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారు మంత్రులుగా కొనసాగుతున్నారని విమర్శించారు. ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళకముందే గవర్నర్ జోక్యం చేసుకుని తక్షణం ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని మోత్కుపల్లి అన్నారు. రాష్ట్రంలో ఉన్న వింత పరిస్థితి ఏ రాష్ట్రంలోను లేదని ఆయన అన్నారు. ఆరోపణలు వచ్చినా పదవులను పట్టుకుని వేలాడుతున్న మంత్రులను ప్రజలే బర్తరఫ్ చేస్తారని మోత్కుపల్లి హెచ్చరించారు.