అశాస్త్రీయంగా జిల్లాల విభజన వద్దు

3

– డీకే అరుణ డిమాండ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు ఆరోపించారు. దీనిపై ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనికి నిరసనగా శనివారం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్షను వీరు  చేపట్టారు. ఈ దీక్షలో వారితోపాటు ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాలతోపాటు వరంగల్‌ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. అయితే కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాబితాలో జనగామ, గద్వాల్‌ లేకపోవడంతో డి.కె.అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఖరికి నిరసనగా వారు శనివారం నిరాహారదీక్షకు దిగారు.జనగామ జిల్లా కోసం పొన్నాల , గద్వాల జిల్లా కోరుతూ అరుణ డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల నిర్ణయంలో కెసిఆర్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం చేశారని, ప్రజాభిప్రాయం తీసుకోకుండా జిల్లాలను నిర్ణయించారని పొన్నాల విమర్శించారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న జిల్లాలను ఇష్టం వచ్చినట్లు కెసిఆర్‌ చీల్చుతున్నారని ఆయన అన్నారు.పారదర్శకంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని విమర్శించారు. అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టామని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని వారు అభిప్రాయపడ్డారు.ఎన్నికల హావిూ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన వల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని పొన్నాల విమర్శించారు. గద్వాల్‌ జిల్లా కోసం రెండు నెలలుగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా డీకే అరుణ గుర్తు చేశారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జిల్లాలపై తనతో చర్చకు రావాలని అరుణ సవాల్‌

జిల్లాల ఏర్పాటులో వాస్తవాలను, చారిత్రిక నేపథ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే ప్రతజు తిరగబడతారని సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి హెచ్చరించారు.  వసతులు, చారిత్రక నేపథ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాల విభజన జరగాలన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణలు చేపట్టిన జిల్లాల పోరుదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జనగామ, గద్వాలలు జిల్లాలు చేయాలని ఇందిరాపార్క్‌ వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని యువకులు అడుగడుగునా నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ లేకుండా తెలంగాణ లేనేలేదని అన్నారు. గద్వాల, జనగామ చారిత్రక నేపథ్యాన్ని గుర్తించుకుని జిల్లాలకు ప్రతిపాదించాల్సిందేనన్నారు. డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.  ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలేదని కాంగ్రెస్‌ జానారెడ్డి ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. రెండు పడకగదుల ఇళ్లు, రిజర్వేషన్లు అమలు వంటి హావిూలు సైతం నెరవేలేదని ఆయన ఆక్షిపించారు. జిల్లాల విభజన పేరిట ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగడంలేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసే ధోరణి యువతలో పెరగాలన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని తాము నిలదీస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం నేర్పాలన్నారు. జిల్లాల కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత సబిత ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థంతో గద్వాల, జనగామను జిల్లాలు చేయడంలేదని ఆరోపించారు. పాలన గాలికి వదిలేసి ఫామ్‌హౌస్‌లో కూర్చుని… విభజించు, పాలించు సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఎందుకు చెల్లించడంలేదని సబిత ప్రశ్నించారు. ఎన్నికలొస్తే తలసాని ఎక్కడ ఓడిపోతారో అన్న భయంతో కేసీఆర్‌ అక్కడ మాత్రమే ఇళ్లు కట్టించారని సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇదిలావుంటే  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ నేత డీకే అరుణ సవాల్‌ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్‌ చేశారు. వనపర్తిని జిల్లా చేస్తూ గద్వాలకు మొండిచేయి చూపిస్తోందని డీకే అరుణ ఆరోపించారు. ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఆమె డిమాండ్‌ చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగానే జరిగిందని ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డీకే అరుణ్‌ ప్రభుత్వానికి సవాల్‌ చేసింది. మరో 24గంటల్లోగా ఇందిరాపార్క్‌ దగ్గరకు సీఎం కొడుకు కేటీఆర్‌గానీ, అల్లుడు హరీష్‌రావుగానీ వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు. .అశాస్త్రీయంగా జిల్లా విభజన జరిగిందన్నారు. దీనిపై జ్యుడిషియల్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ప్రాతిపదిక ఏర్పాటు చేశారో తెలపాలని ఆమె డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన సూచనల్ని ప్రభుత్వం భేఖాతరు చేసిందన్నారు. రాజకీయ స్వార్థంకోసమే జిల్లాల విభజన జరిగిందని ఆమె విమర్శించారు.  ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను ఏర్పాటు చేయాలని  అరుణ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ ఇష్టారాజ్యంగా వుంది తప్ప ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదని విమర్శించారు. స్వంత ప్రయోజనాలకోసమే అరుణ గద్వాలను జిల్లాగా ప్రకటించమంటున్నారనే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏరకమైన మార్గదర్శకాలతో జిల్లా పక్రియను చేపట్టారని ఆమె ప్రశ్నించారు. మేము చేసే పోరాటానికి సమాధానం చెప్పలేకే తమకు విమర్శిస్తున్నారనీ..దీనికి ప్రజలే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతారన్నారు. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గద్వాలను జిల్లాగా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌జిల్లా గద్వాలతోపాటు వరంగల్‌ జిల్లా జనగామను కూడా జిల్లాగా చేయాలనీ..కొత్తజిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తోందని విమర్శించారు. డీకే అరుణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కూడా డీకే అరుణ దీక్షకు మద్దతు తెలుపుతూ ఆమెతో పాటు దీక్షలో పాల్గొన్నారు. ఇక వరంగల్‌ జిల్లాలోని జనగామను కొత్త జిల్లాగా ప్రకటించాలంటూ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా డీకే అరుణతో పాటు రెండు రోజుల దీక్షను ప్రారంభించారు. జనగామను జిల్లా చేయాలని పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నా..ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని పొన్నాల ఆరోపించారు.