అసంతృప్తి నేతలకు బిజెపి టిక్కెట్ల గాలం

కొత్త శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వ్యూహం మార్చిన కమలం

బరిలోకి బలమైన అభ్యర్థులను దించేలా ప్రణాళిక

టిఆర్‌ఎస్‌ మహిళా నేతలపై దృష్టి

కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కీలక మహిళా నేతలను బిజెపిలో చేర్చుకోవడం ద్వారా వారిని బరిలోకి దింపాలని ఆ పార్టీ చూస్తోంది. కొత్త శ్రీనివాసరెడ్డి బిజెపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరడంతో బిజెపికి కూడా టిఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చిఏందుకు సిద్దం అవుతోంది. అసంతృప్త నేతలతో మంతనాలు చేస్తోందని సమాచారం. టిక్కెట్‌ రాకనో లేదా ఇతర కారణాలతో టిఆర్‌ఎస్‌ పట్ల విముఖత ఉన్నవారిని గుర్తించి కమలధలంలో చేరాలని ప్రోత్సహించే పనిలో పడ్డారని సమాచారం. ఇలా

చొప్పదండి తాజామాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ,జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నారనన్న సమాచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. చొప్పదండి టిక్కెట్‌ రాకపోవడంతో

బోడిగె శోభ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు ప్రచారం చేస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఎంత ప్రయత్నించినా వారిని కలిసే అవకాశం రావడంలేదు. దీంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆమె ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను కలిసి చొప్పదండి నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తీరుపై మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఆమె వేములవాడ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకే టిక్కెట్‌ ఖరారు చేయడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆమె వర్గీయులు ఆందోళనలు నిర్వహించినా అధిష్ఠానం పట్టించుకోలేదు. దీంతో ఆమె టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ నుంచి గాని, కాంగ్రెస్‌ నుంచి గాని పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే ఇలాంటి నేతలను గుర్తించి బిజెపిలో చేర్చుకుని టిక్కట్లు ఇవ్వడం ద్వారా అధికార పార్టీకి ఝలక్‌ ఇవ్వాలని బిజెపి చూస్తోంది. ఈ రకంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు షాక్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వేములవాడ టిక్కెట్‌ ఆశించిన తుల ఉమ, చొప్పదండిలో తిరిగి పోటీ చేయాలనుకున్న శోభకు అవకాశాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు. అధినేత కెసిఆర్‌ నుంచి ఆఖరు క్షణం వరకైనా సానుకూల సందేశం రాకపోతుందా అని వారు ఎదురుచూస్తున్నారు. ఇతర పార్టీల టికెట్లు ప్రకటించేలోగానే వారు ఏదో ఓ నిర్ణయం తీసుకోనున్నారని భావిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలనే మళ్లీ అభ్యర్థులనే ప్రకటించారు. చొప్పదండి నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఇక్కడి మాజీ ఎమ్మెల్యే శోభ ఒకవైపు నియోజకవర్గంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి తన ఆవేదన వెల్లడించడం కోసం పలు ప్రయత్నాలు చేశారు. ఆమెకు వారితో చర్చించే అవకాశం దక్కలేదు. పైగా ఆ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ను పోటీకి దింపాలని అధినేత ఒక అవగాహనకు వచ్చారని, ఆయన పేరును లాంఛనప్రాయంగా ప్రకటించాల్సి ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించిన శోభ త్వరలోనే ఒక నిర్ణయం

తీసుకోబోతున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. దీంతో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను కలిసి సంప్రదింపులు జరిపారని, తనకు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. బీజేపీ ఆమె అభ్యర్థిత్వంపై సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చిన శోభ తన అనుచరుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెబుతున్నారు. ఆమె టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ నుంచి గాని, బీఎస్పీ నుంచిగాని పోటీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నియోజకవర్గం నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ మొదటి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. టిక్కెట్‌ రాదని తెలియయడంతో ఆమె బీజేపీ నుంచిగాని, కాంగ్రెస్‌ నుంచిగాని పోటీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారని, ఇరు పార్టీల నేతలతో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా ఇప్పటికే ప్రకటించిన నేతల స్థానంలో కొత్తవారిని నిర్ణయించే అవకావం లేదని టిఆర్‌ఎస్‌ ఖచ్చితంగా చెప్పేసింది. దీంతో అసంతృప్తి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి చూస్తోంది.