అసద్‌ రవూఫ్‌కు ఖరీదైన బహుమతులు

ముంబై ,జూన్‌ 20(జనంసాక్షి):

స్పాట్‌ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ అంపైర్‌ అసద్‌ రవూఫ్‌ చుట్టూ ఉచ్చు బిగిసింది. అతను బుకీల నుండి ఖరీదైన బహుమతులు స్వీకరించిన విషయాన్ని ధృవీకరిస్తూ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. బుకీలకూ, రవూఫ్‌కూ మధ్యవర్తిగా వ్యవహరించిన బాలీవుడ్‌ నటుడు విండూ ధారాసింగ్‌తో ఫోన్‌ సంభాషణలను పోలీసులు సేకరించారు. వారి ఫోన్లను ట్యాప్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం తన బర్త్‌డే సందర్భంగా విండూను ఖరీదైన గిఫ్ట్స్‌ కోసం అసద్‌ సంప్రదించాడు. దీంతో విండూ జైపూర్‌కు చెందిన బుకీ పవన్‌ ద్వారా ఒక ఖరీదైన వాచీతో పాటు బంగారు గొలుసు పంపిస్తున్నట్టు చెప్పాడు. పవన్‌ తన స్నేహితుడైన మరో బుకీ ప్రేమ్‌తేజా ద్వారా వీటిని ఢిల్లీలే అందజేసే విధంగా ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఈ లోపే స్పాట్‌ఫిక్సింగ్‌ కేసు వెలుగులోకి రావడం , బుకీలపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ బహుమతులు అంపైర్‌ అసద్‌ రవూఫ్‌కు చేరలేదు. కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో ఎయిర్‌పోర్టులోనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముంబై కైమ్ర్‌ బ్రాండ్‌ వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసు విచారణలో ఉండగానే రవూఫ్‌ స్వదేశానికి వెళ్ళిపోయాడు. అటు ఐసిసి కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీ నుండి అతన్ని తప్పించింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని, ఏ విచారణకైనా సిధ్దమని అప్పుడు రవూఫ్‌ ప్రకటించాడు. తర్వాత బుకీలు, విండూ ధారాసింగ్‌ ఇచ్చిన వివరాల ప్రకారం పాక్‌ అంపైర్‌కు కూడా స్పాట్‌ఫిక్సింగ్‌లో పాత్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.