అసెంబ్లీలో నగ్న బాబా

2

– సభ్యులకు రాజనీతులు

హర్యానా ,ఆగస్టు 27(జనంసాక్షి):ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్యలాంటిది. భార్యపై భర్త నియంత్రణ ఏవిధంగా ఉంటుందో రాజకీయాలపై ధర్మం నియంత్రణ అదేవిధంగా ఉండాలంటూ ఆయన ప్రబోధించారు. స్త్రీ భ్రూణ హత్యలను నిర్మూలించాలని సూచించారు. పొరుగుదేశం పాకిస్థాన్‌పైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. 40 నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగాన్ని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, సీఎం, గవర్నర్‌ శ్రద్ధగా విన్నారు.ఆయనే జైన దిగంబర బాబా తరుణ్‌ సాగర్‌. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్‌ సాగర్‌ బాబా గవర్నర్‌, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్‌పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.హర్యానా విద్యాశాఖ మంత్రి రాంవిలాస్‌ శర్మ సూచన మేరకు తరుణ్‌ సాగర్‌ ‘కద్వే వచన్‌’ పేరిట ప్రసంగించారు. ‘రాజనీతిపై ధర్మం అంకుశం ఉండాల్సిందే. ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్య. తన భార్య సంరక్షించడమే ప్రతి భర్త కర్తవ్యం అవుతుంది. అదేవిధంగా భర్త అనుశాసనాన్ని స్వీకరించడమే ప్రతి భార్య ధర్మం అవుతుంది’ అని ఆయన ప్రబోధించారు.