అస్త్రసన్యాసం..చేతులెత్తేసిన జనసేన

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): హైదరాబాద్‌ ప్రజల రక్షణకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని, భాజపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. రెండు పార్టీలు కలిసే పోటీచేయాలని అనుకున్నా కరోనా పరిస్థితులు, అనూహ్యంగా వచ్చిన ఎన్నికలతో సాధ్యం కాలేదన్నారు. జనసేన కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని అన్నారు. తాజా ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరముందని, ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాకు జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని భాజపా, జనసేన నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి తాజా దుబ్బాక ఉపఎన్నికేనిదర్శనమని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన తమకు మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాతో కలిసి రావాలని జనసేనను కోరామని, భాజపా విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని కిషన్‌రెడ్డి అన్నారు. కేవలం ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పని చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. భాజపాకు జనసేన తోడుంటే ప్రజల కలలు నెరవేరుతాయన్నారు.